Home ప్రకాశం అరెస్టుల‌తో అట్టుడికిన ప్ర‌కాశం

అరెస్టుల‌తో అట్టుడికిన ప్ర‌కాశం

653
0

– వైసిపి జిల్లా అధ్య‌క్షులు, మాజీ మంత్రి బాలినేని తోపాటు నేత‌ల గృహ‌నిర్భంధం
– జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అరెస్టులు, ఉద్రిక్త‌త‌
– ప్ర‌త్యేక హోదా కోరుతూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు, వ్యాపార సంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు బంద్‌
– స్థంబించిన చిన‌బొంబాయి, వ్యాపార లావాదేవీలు

ప్ర‌కాశం : రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్‌సిపి చేప‌ట్టిన బంద్ జిల్లాలో ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా సిద్ద‌మ‌య్యారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసిపి ఇన్‌ఛార్జీల‌ను గృహ‌నిర్భంధం చేశారు. సంత‌నూన‌త‌ల‌పాడు ఇన్‌ఛార్జి సుధాక‌ర్‌బాబును గృహ‌నిర్భందం చేశారు. దీంతో కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ఆయ‌న కూడా త‌న ఇంటిలోనే నిర‌స‌న‌కు కూర్చున్నారు. ఒంగోలు న‌గ‌రం వైసిపి కార్య‌క‌ర్త‌ల‌తో నిండింది. ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో రాస్తారోకోలు చేశారు. వ్యాపార సంస్థ‌ల‌ను మూయించారు. ప్ర‌భుత్వ కార్యాయాలు మూత‌ప‌డ్డాయి. క‌నిగిరి ప‌ట్ట‌ణంలో ఆర్టీసీ బ‌స్సుల‌ను నిలిపేశారు. దీంతో ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లేవారితోపాటు గ్రామాల‌నుండి ప‌ట్ట‌ణానికి వ‌చ్చేందుకూ వాహ‌నాలు లేవు.

వ‌స్ర్త‌వాణిజ్యంలో చిన‌బొంబాయిగా పేరుగాంచిన చీరాల ప‌ట్ట‌ణం స్థంభించింది. వ‌స్ర్త‌దుకాణాల‌న్నీ మూత‌ప‌డ్డాయి. బ్యాంకులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు తెరుచుకోలేదు. వేకువ‌జామునే ఆర్టీసీ గ్యారేజివ‌ద్ద వైసిపి కార్య‌క‌ర్త‌లు చేరారు. బ‌స్సుల‌ను డిపోనుండే బ‌య‌టికి రానివ్వ‌కుండా అడ్డుకున్నారు. అనంత‌రం ప‌ట్ట‌ణంలోని వ్యాపార సంస్థ‌ల‌ను మూయించారు. ఆర్టీసీ బ‌స్టాండు వద్ద వైసిపి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి య‌డం బాలాజీ ఆధ్వ‌ర్యంలో రోడ్డుపై బైఠాయించారు. వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపేశారు. దీంతో పోలీసు ప్ర‌త్యేక బ‌ల‌గాలు జోక్యం చేసుకున్నారు. ఆందోళ‌న చేస్తున్న వైసిపి కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేసి ఓక‌టోప‌ట్ట‌ణ స్టేష‌న్‌కు కొంద‌రినీ, రెండో ప‌ట్ట‌ణ స్టేష‌న్‌కు కొంద‌రినీ త‌ర‌లించారు.

ఈసంద‌ర్భంగా వైసిపి నేత‌లు మాట్లాడారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించాల‌న్న చిత్త‌శుద్ది టిడిపికి ఉంటే పార్ల‌మెంటులో అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్టిన స‌మ‌యంలో చ‌ర్చ‌కు ఎందుకు నిల‌బ‌డ‌లేద‌ని ప్ర‌శ్నించారు. చ‌ర్చ‌ల్లో ప్ర‌ధాని చెప్పిన స‌మాధానంలో హోదా వ‌ద్దు ప్యాకేజీకే ముఖ్య‌మంత్రి చంద్రబాబుకూడా అంగీక‌రించార‌ని చెప్పిన‌ప్పుడు ఎందుకు అభ్యంత‌ర‌పెట్టలేద‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం కేంద్రంపై వ‌త్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలో ఐక్య‌పోరాటానికి ఎందుకు రావ‌డంలేద‌న్నారు. రాక‌పోయినా తాము చేస్తున్న ఆందోళ‌న‌ను ఎందుకు భ‌గ్నం చేయాల‌ని ప్ర‌భుత్వం పోలీసుల‌ను ప్ర‌యోగించి అరెస్టులు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.

ఒంగోలు, సంత‌నూత‌ల‌పాడు, చీరాల‌, కందుకూరు, క‌నిగిరి, గిద్ద‌లూరు, మార్కాపురం, అద్దంకి, ద‌ర్శి, య‌ర్ర‌గొండ‌పాలెం, ప‌ర్చూరు, కొండేపి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టులు చేశారు. ఒంగోలు ప‌ట్ట‌ణంలో వైసిపి జిల్లా అధ్య‌క్షులు, మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డినీ గృహ‌నిర్భంధం చేశారు. అద్దంకిలో డాక్ట‌ర్ గ‌ర‌ట‌య్య‌ను గృహ‌నిర్భంధం చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా అరెస్టుల‌తో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. బంద్ పిలుపుతు విద్యాసంస్థ‌లు స్వ‌చ్ఛందంగానే బంద్‌కు స‌హ‌క‌రించారు. ముందురోజే సెల‌వు ప్ర‌క‌టించారు. హోదా సాధ‌న అవ‌స‌రాన్ని ప్ర‌జ‌లు వ్య‌క్తం చేశారు.

ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్‌ పిలుపుతో ప్రభుత్వం ఎదురు దాడికి సిద్ధమైంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో 144 సెక్షన్‌ విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు 30 యాక్టును అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయాన్నే పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలోనే అరెస్టు చేశారు. సంతనూతలపాడు సమన్వయకర్త టీజేఆర్‌ సుధాకర్‌ బాబును ఒంగోలులోని ఆయన కార్యాలయంలో నిర్బంధించారు. పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావుతోపాటు మరో ఎనిమిది మంది నాయకులను అరెస్టు చేసి జరుగుమల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటుండగా అరెస్టు చేశారు. గిద్దలూరులో అన్నా రాంబాబును ఆయన కార్యాలయంలోనే నిర్బంధించారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలను పోలీసులు ఎక్కడకిక్కడ అరెస్టు చేశారు.