చీరాల : ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా వైద్యసహాయం పొందాలనుకునేవాళ్లు ఎలాంటి ఆందోళన అవసరంలేదని ఎన్‌టిఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ పేర్కొన్నారు. కామాక్షి కేర్ హాస్పిటల్‌లో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెల్లకార్డులో నమోదైన పేర్లు అన్నీ రేషన్ తీసుకుంటూ ఫోర్స్‌లో ఉంటే చాలని చెప్పారు. వైద్యశాలకు వెళ్లేటప్పుడు కార్డు కానీ, కార్డు నంబరు కానీ తీసుకెళ్లి ఎన్‌టిఆర్ వైద్యమిత్రకు అందిస్తే ఒక్కరోజులో శస్ర్తచికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. అత్యవసర వైద్యసహాయం అవసరమైన సమయాల్లో నేరుగా ఎన్‌టిఆర్ వైద్యసేవ అనుబంధ హాస్పటల్స్‌లో ఉండే డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవ కాల్‌సెంటర్‌కు ఒక్క ఫోన్‌కాల్ చేసి క్షణాల్లో అవసరమైన వైద్యసహాయం అందిస్తారని తెలిపారు. హాస్పిటల్లో చేరినప్పటి నుండి తిరిగి ఇంటికి వెళ్లేవరకు ఎన్‌టిఆర్ వైద్యసేవలో ఉచితంగా పొందవచ్చన్నారు. అవసరమైన మందులు, పరీక్షలు ఉచితంగానే అందిస్తారని తెలిపారు. ఏ జబ్బుకు ఏ హాస్పటల్‌లో చూస్తారనేది ఎన్‌టిఆర్ వైద్యసేవ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. యాప్ తెలియకుంటే సమీపంలో ఉండే ఎన్‌టిఆర్ వైద్యసేవ అనుబంధ హాస్పటల్స్‌లో ఉండే వైద్యమిత్రను అడిగి తెలుసుకోవచ్చన్నారు. ఎన్‌టిఆర్ వైద్యసేవతోపాటు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌లోనూ ఎన్‌టిఆర్ వైద్యసేవలో అందిన అన్ని సేవలు ఉచితంగానే అందుతాయని చెప్పారు. 104కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో అన్నిరకాల జబ్బులకు ఎన్‌టిఆర్ వైద్యసేవలో అందుబాటులో ఉన్నాయన్నారు. న్యూరాలజీకి సంబంధించిన డాక్టర్లు జిల్లాలో అందుబాటులో లేనందున కొంత ఇబ్బంది ఉందన్నారు. దానికి అదిగమించేందుకు ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్లు చెప్పారు. 8333814015, 8333814016నంబర్లకు ఫోన్ చేసి కూడా ఎన్‌టిఆర్ వైద్యసేవ వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. కొత్తగా అనాధ బాలికలకు అమృత హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ తమ వైద్యశాలలో ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా ప్రతిరోజూ ఉదయం 8నుండి సాయంత్రం 5వరకు ఉచిత ఓపితో చూస్తున్నట్లు చెప్పారు. వైద్యపరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి శస్ర్తచికిత్సలు కూడా ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా చేస్తున్నట్లు తెలిపారు.
ఎముకల వైద్యనిపుణులు డాక్టర్ చలువాది వెంకటేష్ మాట్లాడుతూ రక్తగాయాలతో వైద్యశాలకు వస్తే ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా ఒక్కరోజులోపే రోగి ఆరోగ్యస్థితినిబట్టి శస్ర్తచికిత్స చేస్తామని చెప్పారు. రక్త గాయాలు కనిపించకుండా ఎముకలు విరిగి ఉంటే రెండు రోజుల్లోపు ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా అప్రూల్ తీసుకుని శస్ర్తచికిత్స చేస్తామని తెలిపారు. విరిగిన గాయాలకు స్టీలు రాడ్డులు వేయాల్సి వస్తే నాణ్యమైనవే వేస్తారని తెలిపారు. అపోహలు అవసరం లేదన్నారు. శస్ర్త చికిత్స చేసినప్పటి నుండి కుట్లు తీసి ఇంటికి పంపేవరకు అన్ని ఖర్చులు ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మోకాళ్ల మార్పిడి, తొంటి మార్పిడి వంటివి ఎన్‌టిఆర్ వైద్యసేవకు ర్తించవని చెప్పారు. అలాంటి చికిత్స అవసరమైన పేదలైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్ధిక సహాయం పొందే అవకాశం ఉందని చెప్పారు.
చెవి, ముక్కు, గొంతు వైద్యనిపుణులు డాక్టర్ పలుకూరి సురేష్ మాట్లాడుతూ గత మూడు నెలల్లో 50కిపైగా ఇఎన్‌టి శస్త్రచికిత్సలు ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా చేసినట్లు తెలిపారు. డాక్టర్ ముద్దన నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్‌టిఆర్ వైద్యసేవ రాకముందు నెలకు 10ఆపరేషన్లు చేస్తే బాగా చేశామనుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు నెలకు 50కిపైగా ఆపరేషన్లు చేసి వైద్యసహాయం అవసరమైన పేదలకు సహాయపడగలుగుతున్నామని సంతృప్తి వ్యక్తం చేశారు. పాముకాలు, పురుగుమందు తాగిన రోగులు వెంటిలేటర్ దశకు వచ్చినవారికి మాత్రమే ఎన్‌టిఆర్ వైద్యసేవ వర్తిస్తుందని తెలిపారు. లాప్రోస్కోపి వైద్యనిపుణులు డాక్టర్ గవిని లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నందున ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా కుట్లులేకుండా చేసే ఆపరేషన్లు కూడా చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్‌లో చేస్తున్నట్లు తెలిపారు.