హనుమంతునిపాడు : సంక్రాంతికి వెలుగొండ ద్వారా నీళ్లిస్తే తాను గుండు గీయించుకుంటానని మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వెలుగొండ సాధన కోసం కనిగిరి నుండి చేపట్టిన పాదయాత్ర బుధవారం హనుమంతునిపాడు మండలంలో సాగింది. 1997లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు 2004దాకా పనులు మొదలు పెట్టలేదని అన్నారు. 2004లో అధికారానికి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనులు ప్రారంభించి 70 శాతం పనులు పూర్తి చేశారని చెప్పారు. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు వీలుకాలేదన్నారు. ఆ పనులు పూర్తి చేయడం జగన్‌కే సాధ్యమని చెప్పారు.
మార్కాపురం ఎంఎల్ఎ జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ 2019 సంక్రాంతికి వెలుగొండ నీళ్లిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. ఇంతకీ చంద్రబాబు ఏ సంక్రాంతికి నీళ్లిస్తారని ప్రశ్నించారు. 2020సంక్రాంతికా.. 2021 సంక్రాంతికా? అని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా నీళ్లిస్తామని వాయిదాలు వేస్తూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఆరోపించారు. తాము అధికారానికి వస్తేనే వెలుగొండ పూర్తి చేయడం సాధ్యమవుతుందని సంతనూతలపాడు ఎంఎల్ఎ ఆదిమూలం సురేష్ పేర్కొన్నారు. కృష్ణా ర్జునులు కలిశారని వైవి, బాలినేనినుద్దేశించి అన్నారు. వీరిద్దరి కలయికతో వచ్చే ఎన్నికల్లో వైఎస్స్సార్సీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమన్నారు.
వైఎస్ఆర్ బ్రతికి ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని వైసిపి జిల్లా ఇన్‌ఛార్జి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు పశ్చిమ ప్రకాశంపై కనీసం జాలి, దయ లేదన్నారు. ఇక్కడి ప్రజలను కనీసం ఓటర్లుగా కూడా పరిగణించడం లేదని ఆరోపించారు. మోడీ, పవన్ సహకారంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 90 శాతం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపిల త్యాగం వృధాగాపోదన్నారు.
జిల్లా ఏర్పడి 49 సంవత్సరాలైనప్పటికీ సమగ్ర అభివృద్ధికి నోచుకోలేదని మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇంకా 33 లక్షల జనాభాలో పది లక్షల మంది వలసలు పోయే పరిస్థితులు ఉంటే స్వతంత్ర ఫలాలు ఎవరికందాయని అన్నారు. వైఎస్ హయాంలో 70శాతం పనులు పూర్తి చేస్తే గడిచిన నాలుగేళ్ళలో మూడు కిలో మీటర్ల సొరంగం తవ్వలేక పోయారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ సంక్రాంతికి నీళ్లిస్తామని చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నాడని ఆరోపించారు. ఇన్నాళ్లు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. భూగర్భ జలాలు 19 మీటర్లకు పడిపోయాయని పేర్కొన్నారు. ఫ్లోరిన్‌తో ప్రజలు కిడ్నీ వ్యాధులతో ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వానికి పట్టదా? అని ప్రశ్నించారు. పీసీ పల్లి, కొండపి నియోజక వర్గంలోని మర్రిపూడి మండలానికి వెలుగొండ జలాలు వచ్చేట్లు చేస్తామన్నారు. పాదయాత్రలో వైఎస్ఆర్‌సిపి నేతలు మాజీ ఎమ్మెల్యేలు వుడుముల శ్రీనివాసరెడ్డి, పిడతల సాయి కల్పనరెడ్డి, కెపీ కొండారెడ్డి, కనిగిరి, దర్శి, కొండపి, పర్చూరు, గిద్దలూరు, చీరాల, ఎస్ఎన్ పాడు, అద్దంకి సమన్వయకర్తలు బుర్రా మధుసూదన్ యాదవ్, బాదం మాధవరెడ్డి, అశోక్ బాబు, రావి రామనాధం బాబు, యడం బాలాజీ, టీజేఆర్ సుధాకర్ బాబు, గరటయ్య, పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, కావలి ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.