ఒంగోలు : ఎన్నికలు సమీపిస్తేచాలు చీరాలలో చేనేతలకు చైతన్యం వస్తుంది. వీరి చైతన్యాన్ని సొమ్ము చేసుకునేందుకు రాజకీయ పార్టీలకు కదలిక వస్తుంది. చేనేతను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలూ ప్రకటిస్తారు. ఎన్నికలు ముగిశాక చూస్తే చేనేత ప్రతినిధులు ఎవ్వరూ చట్టసభల్లో ఉండరు. చేనేత ఉద్దరించేందుకు అవసరమైన చర్చ చేసేందుకు మంత్రిత్వ శాఖ ఉండదు. ఉన్న శాఖను జౌళితో మిళితం చేయడంతో చేనేతకు కేటాయించిన నిధులను సైతం టెక్స్‌టైల్ పరిశ్రమల అధినేతలు తన్నుకు పోవడం సహజంగా మారింది. చీరాల నియోజకవర్గంలో 40వేలకు పైగా చేనేత సామాజికవర్గాల ఓటర్లు ఉన్నారు. వృత్తిరీత్యా వీరంతా ఒకే చోట ఉంటారు. కానీ యజమానులు, కార్మికులు పడుగు పేకల్లాగా అల్లుకుంటారు తప్ప ఎప్పటికీ కలవరు. అదే నైజం రాజకీయాల్లోనూ ప్రతిబింభిస్తుంది.
అత్యధిక మంది చేనేత ఓటర్లు ఉన్నారన్న ఆశతోనే 1999లో కాంగ్రెస్ చేనేత అభ్యర్ధి అయిన గోలి అంజలీదేవికి సీటు ఇచ్చింది. అప్పట్లో ఆమె ఓటమి చెందారు. 2004 ఎన్నికల్లో చీరాల నుండి తనకు ప్రాతినిధ్యం కల్పించాలని జంజనం శ్రీనివాసరావు కాంగ్రెస్ నాయకత్వంపై వత్తిడి తెచ్చి డాక్టర్ కొణిజేటి రోశయ్యతో పోటీపడ్డారు. అప్పట్లో ఆయనకు సీటు రాకపోవడంతో టిడిపిలో చేరారు. చేనేతల్లో ఆయన తెచ్చిన చైతన్యం, ఐక్యత చూసిన టిడిపి 2009లో చీరాల నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓటమి చెందారు. 2014లోనూ చేనేత సామాజిక వర్గానికి చెందిన పోతుల సునీతను టిడిపి మళ్లీ చేనేత అభ్యర్ధినే తెరపైకి తీసుకొచ్చింది. అమె కూడా ఓటమి చెందారు. ప్రగడ కోటయ్య, ముట్టె వెంకటేశ్వర్లు, సజ్జ చంద్రమౌళి తర్వాత గెలుపు ఇచ్చిన చేనేత అభ్యర్ధులు ఎవ్వరూ లేరు. అయినప్పటికీ చేనేత ఓటర్లను ప్రసన్నం చేసుకున్న ఇతర సామాజికవర్గాల అభ్యర్ధులకు మాత్రం విజయం వరిస్తుంది. అదే చేనేతల్లో ఉన్న పడుగు – పేక సామెత. ఈ దఫా ఎన్నికల్లో చేనేత అభ్యర్ధిత్వం కోరతారా? లఏక ఓటుకు నోటు ఇచ్చే అభ్యర్ధికే పట్టం కడతారో వేచి చూడాలి.