చీరాల : చేనేత వృత్తి తరిగిపోతుంది. చేనేత కార్మికుల పిల్లలు చేనేత వృత్తిని వదిలి ఇతర వృత్తులకు వెళుతున్నారు. అలాంటి వారికి చేనేతపై శిక్షణ ఇచ్చి తిరిగి చేనేతలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రూ.32కోట్లతో 31మినీ క్లస్టర్లను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రకాశం జిల్లాలో 16క్లస్టర్లు అమలయ్యాయి.
వీటిపరిధిలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు సిబిఐ, ప్రధాని, రాష్ట్రపతి కార్యాలయాలకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేంద్రప్రభుత్వ అధికారితో విచారణ చేయించారు. విచారణలో అవినీతి చోటు చేసుకున్నది వాస్తవమని నిరా్ధరించారు. ఒక మగ్గం కొనుగోలు చేసి దానినే మరో నాలుగుసార్లు కొన్నట్లు బిల్లులు చూపి సొమ్ము చేసుకున్న వాస్తవాలు ఉన్నత స్థాయి విచారణలో వెలుగు చూసినట్లు తెలిసింది. ఈనేపధ్యంలో చేనేత క్లస్టర్లలో జరిగిన అవినీతికి కేసును సిబిఐకి అప్పగించాలని, అవినీతికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుని చేనేత కార్మికులకు లబ్ది చేకూర్చాలని చేనేత ప్రతినిధులు కోరుతున్నారు.