ఒంగోలు : ఒంగోలు, అద్దంకి, చీరాల, పర్చూరు నియోజకవర్గాలతోపాటు కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు ఆర్‌డిఒ పోస్టు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పోస్టులో ఇప్పటి వరకు పనిచేసిన కె శ్రీనివాసరావు నర్సరావుపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో ఎవరు రానున్నారన్నది అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. రానున్నది ఎన్నికల సమయం కావడంతో వచ్చే అధికారి ఎవరి సిఫార్సుపై వస్తారు? ఎవరి సిఫార్సుపై వస్తే ఎవరికి ప్రయోజనం, అసలు సిఫార్సులేకుండా వచ్చే పరిస్థితి ఉందా? అనేక కోణాల్లో చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఆర్‌డిఒలను, సబ్‌కలెక్టర్లను రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు చేయడంతో గత మూడేళ్లుగా ఒంగోలు ఆర్‌డిఒగా ఉన్న కె శ్రీనివాసరావుకు బదిలీ అనివార్యమైంది. ఒంగోలు ఆర్‌డిఒ పోస్టు ప్రతిష్టాత్మకంగా మారింది. జిల్లాలో 18 మండలాలతో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న డివిజన్ కావడం, భూ వివాదాలు కూడా అధికంగానే ఉండటం కూడా ప్రాధాన్యతకు కారణమైంది.
సిఫార్సుల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు…
ఒంగోలు ఆర్డీవోగా కె శ్రీనివాసరావు మూడేళ్లకు పైగా పనిచేశారు. ఆయనకు ఇది సొంత ప్రాంతం కావడంతో ఆరోపణలు, వివాదాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ నేతల సిఫార్సులు బలంగా ఉండడంతో మూడేళ్లకుపైగా పనిచేయగలిగారు. ఎటువంటి సమస్య వచ్చినా సమన్వయంతో వ్యవహరించగలిగిన నేర్పు ఉండటం ఆయనకు కలిసి వచ్చింది. ప్రజాప్రతినిధులు, నాయకులతో సన్నిహితంగా ఉంటూనే ఉన్నతాధికారులతోనూ సఖ్యతగా వ్యవహరించారు. ఒకరకంగా జిల్లాలో ఇరువర్గాలకు మధ్య వారధిగా కూడా వ్యవహరించిన నేర్పు. కీలకమైన, సున్నితాంశాలను, వివాదాస్పద అంశాలను పరిష్కరించడంలో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన బదిలీతో ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేసేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా బదిలీల్లో ఎవర్నీ కేటాయించకుండా ఖాళీ ఉన్న డివిజన్ ఒంగోలు. జిల్లాలోనే పనిచేస్తున్న ఓ అధికారి ఆ పోస్టులోకి వచ్చేందుకు జిల్లాలో ముఖ్యనాయకులతో రాయబారం నడిపి ఉన్నతాధికారుల ఆమోదం పొందినప్పటికీ ఆయన పనిచేస్తున్న ప్రదేశంలోని ప్రజాప్రతినిధులు అక్కడే ఉండాలని కోరడంతో అతని ప్రయత్నం ఆగినట్లు తెలిసింది. గతంలో ఏలూరులో పనిచేసిన మరో అధికారి గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి ద్వారా ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక్కడి ప్రజాప్రతినిధుల చుట్టూ ఇద్దరు అధికారులు రోజూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది. సిఫార్సు చేసేందుకు కూడా నేతలు ఆచితూచి అడుగేస్తున్నట్లు సమాచారం. ఎవరిని ఒంగోలు ఆర్‌డిఒగా పోస్టింగు ఇస్తారనేది మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే.