ఒంగోలు : కొండేపి వైసిపి సమస్య కొలిక్కి వచ్చినట్లే. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సారధ్యంలో కొండేపి నియోజకవర్గ బాధ్యతలు తిరిగి వరికూటి అశోక్‌బాబుకే ఇస్తూ అధిస్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా కొండేపిలో వరికూటి అశోక్‌బాబును మార్చుతున్నట్లు ప్రచారం జరిగింది. అధినేత వైఎస్ జగన్ కూడా అశోక్‌బాబు తీరు మార్చుకుని అందరినీ కలుపుకు పోయేందుకు ఇచ్చిన గడువులో మార్పు రాలేదనే కారణంతో ఒంగోలు రిమ్స్ వైద్యులు డాక్టర్ వెంకయ్య పేరును ముందుకు తీసుకొచ్చారు. అంతే కాదు రానున్న ఎన్నికల్లో డాక్టర్ వెంకయ్యకే సీటు అన్నంత ప్రచారం చేశారు.
దీంతో గత ఎన్నికల్లో పార్టీ కోసం పెద్దమొత్తంలో ఖర్చులు పెట్టుకుని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో డాక్టర్ వరికూటి అమృతపాణి ఓటమి చెందినప్పటికీ ఎన్నికల అనంతరం పార్టీని తనదైన పద్దతిలో నడపుకుంటూ వచ్చారు. ఎన్నికల అనంతర పరిణామాల్లో కొండేపి ఇన్‌ఛార్జిగా ఉన్న జూపూడి ప్రభాకర్ టిడిపిలోకి వెళ్లడంతో కొండేపిలో నాయకత్వం కరువై కార్యకర్తలు స్థబ్దతగా ఉన్నారు. అదే దశలో రవాణ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్న వరికూటి అమృతపాణి సోదరుడు వరికూటి అశోక్‌బాబు ఉద్యోగం వదులుకుని వైసిపి నియోజకవర్గ బాధ్యతల్లోకి వచ్చారు. అప్పటి నుండి నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు.
నియోజకవర్గ రాజకీయాల్లో జరిగిన మార్పులకు తోడు జిల్లా నాయక్తంలో ఉన్న ఆదిపత్యపోరు వరికూటి బ్రదర్స్‌పై పడింది. ఇద్దరిలో ఎవ్వరో ఒకరే తేల్చుకోవాలని చెప్పడంతో డాక్టర్ అమృతపాణి తన పార్లమెంటు బాధ్యతలు వదులుకున్నారు. ఆయన సోదరుడు అశోక్‌బాబుకు కొండేపి నుండి ప్రాతినిధ్యం ఇవ్వాలని సూచించారు. అయితే అదీ లేదని ప్రత్యామ్నయ ప్రమత్నాలు చేయడంతో వైసిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు స్థంభించడంతోపాటు అశోక్‌బాబును పార్టీ వదులుకునే పరిస్థితి వస్తే తాము పార్టీని వదిలి అశోక్‌వెంట ఉంటామని గ్రామస్థాయి నుండి, మండల, నియోజకవర్గ నాయక్తం ప్రకటించారు. దీనికితోడు డాక్టర్ వెంకయ్య అధినేతను, పార్టీని నోరుజారి మాట్లాడిన ఫోను సంభాషణల నేపధ్యంలో బాలినేని సారధ్యంలో కొండేపి నియోజకవర్గంలో అశోక్‌బాబుకు తిరిగి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.