Home క్రైమ్ అమ్మాయిలను చేరబట్టి… అబాసుపాలైన మాజీ ఎంఎల్ఎ గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి

అమ్మాయిలను చేరబట్టి… అబాసుపాలైన మాజీ ఎంఎల్ఎ గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి

501
0

హైద‌రాబాద్ : రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు రావడం ప్ర‌స్తుత స‌మాజంలో స‌హజంగా మారింది. కానీ ఇప్పుడు అడపిల్లలను వేధిస్తూ అడ్డంగా దొరికిపోతున్న ప్ర‌జాప్ర‌తినిధులూ మీడియా ముందు తెల్ల‌మొఖం వేస్తున్నారు. అభంశుభం తెలియని అమ్మాయిలను… ఆసరా కోరి ఆదుకొమ్మని వచ్చే అబలలను వేధిస్తున్నారన్న ఆరోపణలు ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఎక్కువయ్యాయి. మొన్ననే టిఆర్ఎస్ ఎంపీ డీఎస్ తనయుడు, బీజేపీ నేత అయిన సంజయపై కొందరు విద్యార్థినులు నేరుగా తెలంగాణ‌ హోమ్ మంత్రికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన సొంత కాలేజి విద్యార్థినులనే వేధిస్తున్నారని వారంతా వాపోయారు. దాంతో ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు న‌మోదు సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లైంగిక వివాదంలో చిక్కుకున్నారు.

గండ్ర వెంకట రమణా రెడ్డి తనను శారీరకంగా వాడుకొని వదిలేశాడని కొమురెల్లి విజయలక్ష్మిరెడ్డి అనే మహిళ ఆరోపించింది. గండ్రపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. మదర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధిగా పనిచేస్తున్న విజయలక్ష్మి ఆదివారం హన్మకొండ వడ్డెపల్లిలోని జీఎంఆర్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద ధర్నా చేపట్టింది. తాను స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో గండ్ర వెంకటరమణారెడ్డితో పరిచయం ఏర్పడిందని చెప్పారు. అది చనువుగా మారిందని చెప్పిందన్నారు. ఆయన గత ఐదేళ్లుగా తనను శారీరకంగా వాడుకున్నాడని, 4 రోజుల క్రితం వరకు తనతో చనువుగా ఉన్నాడని తెలిపింది.

తాను ఈ నెల 3వ తేదీ రాత్రి ఆయనను కలిసేందుకు జీఎంఆర్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్లానని, కానీ.. ఆయన పోలీసులకు సమాచారమిచ్చి అరెస్టు చేయించారని ఆరోపించింది. ఇదిలా ఉండ‌గా ధర్నా చేస్తున్న విజయలక్ష్మిని పోలీసులు సుబేదారి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు గండ్రపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సదయ్య తెలిపారు. అయితే ఆమె ఆరోపణలని గండ్ర వెంకటరమణారెడ్డి ఖండించారు. తనపై విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలు, నిరాధారమైనవని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఆమెకు అన్నిరకాలా మద్దతు తెలుపుతూ నీచపు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయంగా ప్రజల్లో తనకున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక, తనను నేరుగా ఎదుర్కోలేక ప్రత్యర్థులు.. చివరికి ఓ మహిళతో లైంగిక ఆరోపణలు చేయించడం దురదృష్టకరమని గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి వ్యాఖ్యానించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి నిజాయితీ కలిగిన అధికారి అని, నిష్పక్షపాత విచారణ జరిపించి న్యాయం చేస్తారన్న నమ్మకం త‌న‌కు ఉందని అన్నారు. ఈ మేరకు తన సతీమణి జ్యోతితో కలిసి హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ దినపత్రికలో ఇటీవల ‘బ్లాక్‌మెయిల్‌ భామ’ అని కథనం వచ్చిందని, తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ ఆమే అయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కాగా తన భర్త అలాంటివారు కాదని వెంకటరమణారెడ్డి భార్య జ్యోతి అన్నారు. తమ పెళ్లయ.. 33 ఏళ్లు అవుతోందని, ఆయన ఎలాంటి వారో తనకు తెలుసునని ఆమె పేర్కొన్నారు.