Home ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ర‌ద్దుకై క‌లెక్ట‌రేట్ల ముట్ట‌డిలో ఉద్యోగ‌, ఉపాధ్యాయులు

సిపిఎస్ ర‌ద్దుకై క‌లెక్ట‌రేట్ల ముట్ట‌డిలో ఉద్యోగ‌, ఉపాధ్యాయులు

590
0

అమ‌రావ‌తి : ప్ర‌భుత్వం నూత‌నంగా అమ‌లు చేస్తున్న కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ (సిపిఎస్‌) విధానం ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల ఐక్య‌వేదిక, ఫ్యాప్టో ద‌శ‌ల‌వారీ పోరాట‌లంలో బాగంగా శ‌నివారం క‌లెక్ట‌రేట్ల ముట్ట‌డికి సిద్ద‌మ‌య్యారు. ఉద్యోగ‌, ఉపాధ్యాయులు క‌లెక్ట‌ర్ కార్యాల‌య‌వ‌ద్ద‌కు ఉద‌యాన్నే చేరుకున్నారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌య ప్ర‌ధాన ద్వారాల‌ను మూసేసి సిబ్బందిని అడ్డుకున్నారు.

రాష్ర్ట‌వ్యాప్తంగా అన్ని క‌లెక్ట‌ర్ కార్యాలయాల వ‌ద్ద ఉద్యోగులు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న జిల్లా న‌లుమూల‌ల నుండి వ‌చ్చిన ఉద్యోగులు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సిపిఎస్ విధానాన్ని ర‌ద్దు చేస్తూ శాస‌న స‌భ‌లో తీర్మానం చేయాల‌ని డిమాండు చేస్తున్నారు. ఉద్యోగులు జీవిత కాలం పొదుపు చేసుకుని ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత జీవిత బ‌ద్ర‌త‌కు దాచుకున్న సొమ్మును షేర్ మార్కెట్‌లో పెట్టాల‌నే సిపిఎస్ పెన్ష‌న్ విధానం ర‌ద్దు చేసి ఒల్డ్‌పెన్ష‌న్ విధానం (ఒపిఎస్‌) అమ‌లు చేయ‌డాల‌ని డిమాండు చేశారు.

ఒంగోలు : ఒంగోలు క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వ‌ద్ద ఫ్యాప్టో ఆధ్వ‌ర్యంలో ఉద్యోగులు ఉద‌యాన్నే క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వ‌ద్దకు చేరుకున్నారు. క‌లెక్ట‌రేట్ ప్ర‌ధాన గేట్ల మూసేసి ఆందోళ‌న‌కు దిగారు. ఈసంద‌ర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కొమ్మోజి శ్రీ‌నివాస‌రావు మాట్లాడారు. ఉద్యోగుల జీవితాల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆడుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. భ‌విష్య‌నిధికి బ‌ద్ర‌త క‌ల్పిస్తూ సిపిఎస్ విధానం ర‌ద్దు చేయాల‌ని కోరారు. కేర‌ళ త‌ర‌హాలో పాత పెన్ష‌న్ విధానాన్ని అమ‌లు చేసేందుకు శాస‌న స‌భ‌లో తీర్మానం చేయాల‌ని కోరారు.

విశాఖ‌ప‌ట్ట‌ణం : విశాఖ‌ప‌ట్ట‌ణం క‌లెక్ట‌రేట్‌ను ఉద్యోగ‌, ఉపాధ్యాయులు ముట్ట‌డించారు. క‌లెక్ట‌ర్‌ కార్యాల‌యాల‌ని ఉద్యోగులు వెళ్ల‌క‌ముందే ఉపాధ్యాయులు, ఆందోళ‌న కారులు క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి ర్యాలీగా వెళ్లారు. ప్ర‌ధాన గేట్ల‌ను మూసేసి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. సిపిఎస్ ర‌ద్దు చేయాల‌ని, ఒపిఎస్ అమ‌లు చేయాల‌ని నినాదాలు చేశారు.