– ప్రకాశంలో వైవి తీరుపై విమర్శలు
– ఇలాగైతే 2019లో ఏమౌతుందోనన్న ఆందోళన
ఒంగోలు : వైఎస్ఆర్‌సిపిలో అబద్రత వెంటాడుతుంది. రానున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు గెలుపు గుర్రాలను వెతకాలని ఆపార్టీ అధినేత జగన్ చేస్తున్న ప్రయత్నాలు నియోజకవర్గ ఇన్‌ఛార్జీల్లోనే అబద్రత కలిగిస్తున్నాయి. పార్టీని నమ్ముకుని నాలుగేళ్లుగా ప్రతిపక్షంలోనే ఉంటూ ఆర్ధిక భారమైనా మోసుకొస్తున్న నేతలను కాదని గెలుపు గుర్రాల పేరుతో కొత్తవారిని తెచ్చిపెడతాయన్న ఆందోళన ఇన్‌ఛార్జీలను వెంటాడుతుంది. దీంతో అధికారపార్టీ ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని చెప్పి జనానికి చేరువ కావడం కన్నా సమర్ధులమని పార్టీ నేతల వద్ద నిరూపించుకోవడమే పెద్ద పరీక్షగా మారింది. ఇందుకు ఇటీవల జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలే నిదర్శనం. జిల్లాలో పార్టీ బలాబలాలను అంచనా వేసేందుకు అధినేత జగన్ సర్వేటీమ్ ఇన్‌ఛార్జీ ప్రశాంత్‌కిషోర్ బృంధంతో రకరకాల నేతలతో మంతనాలు జరిపారు. తమపార్టీ ఇన్‌ఛార్జీల పనితీరుతోపాటు అధికారపార్టీలోని నేతలతో మంతనాలు జరపడం, కొందరు మాజీలతోనూ మంతనాలు జరిపారనే వార్తలు ఆ పార్టీ ఇన్‌ఛార్జీలు, ఆశావహుల్లో ఆందోళనకు కారణమైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీకి వెన్నంటి ఉన్న కార్యకర్తలు, నాయకులు కాకుండా గెలుపు పేరుతో ఇతరులకోసం చేసే ప్రతయ్నాలు ఇన్‌ఛార్జీలు కొనసాగుతున్న వారిపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటి వరకు ఖర్చులు పెట్టుకుని, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు వదిలేసి రాజకీయమే జీవితంగా వచ్చిన ఇన్‌ఛార్జీలు మాత్రం ఆలోచనలో పడ్డారు. ఇలాగే కొనసాగి చివరి నిమిషంలో సీటు కోల్పోతే భవిష్యత్తేంటి అన్న ప్రశ్నతో కొంత నిరుత్సాహానికి గురై కొంతకాలంగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు జరగని పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కొండేపి నియోజకవర్గంలో తాజాగా జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం.
జిల్లాలో అధినేత జగన్ బందువర్గంలోనే రెండు శిభిరాలు నడవడం చూస్తుంటే కార్యకర్తల్లో ఆందోళన కలిగించే పరిస్థితి ఉంది. వైసిపి జిల్లా అధ్యక్షునిగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మరొకరు తాజా మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి. నాయకుడంటే వాసన్నలా ఉండాలని కొండేపి ఇన్‌ఛార్జిగా తొలగించబడ్డ వరికూటి అశోక్‌బాబు కార్యకర్తల మీటింగులో కీర్తిస్తూనే వైవి సుబ్బారెడ్డి పచ్చని పైరకు చీడపట్టినట్లు జిల్లాలో వైసిపిని నష్టపరుస్తున్న తీరును ఎండగట్టారు.
వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయి షాకింగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా? తనని కావాలని పక్కన పెట్టడం సహించలేక మొత్తం పార్టీ పునాదులనే పెకిలిస్తున్నారా? సొంత మనిషి అయిన తనకు జగన్ ద్రోహం చేశాడని నమ్ముతున్నాడా? అందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికి ఇటీవల పరిణామాలు చూస్తే… ఒకే ఒక్క సమాధానం అవును. జగన్‌కు బుద్ది చెప్పాలని, లేదంటే తనను అవమానించిన జగన్ కు తన సత్తా చూపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ఆయనే జగన్ సొంత బంధువు, బాబాయి అయితన తాజా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఒంగోలు ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో మొన్నటి వరకు చక్రం తిప్పారు. అయితే తనకంటే పార్టీలో క్రీయాశీలంగా ఎవరు ఉన్నా… అది సొంత బంధువైనా సరే జగన్ జీర్ణించుకోలేరు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించరాదని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే విషయాన్ని నేరుగా సుబ్బారెడ్డికే చెప్పేసారని సమాచారం.
బాబాయి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని… ఆయన పార్టీకి పరిమితం అవుతారని తనను కలిసిన జిల్లా నేతల వద్ద జగన్ పదేపదే చెబుతున్నారట. ఇదంతా అవమానంగా భావించిన వైసీ సుబ్బారెడ్డి తనను చిన్నబుచుకునేలా చేసిన జగన్‌కు ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్న వైవి సుబ్బారెడ్డి అందుకనుగుణంగా పావులు కడుపుతున్నారని వైవిపి కేడర్ గుసాగుసలాడుకుంటోంది. ఈ క్రమంలోనే ఒకవైపు జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు దానికి సమాంతరంగా వైవి సుబారెడ్డి వెలుగొండ సాధన పేరుతో పాదయాత్ర చేపట్టారనే ఆరోపణ ఉంది.ఇది కూడా జగన్‌కి కంటగింపుగా మారిందన్న ప్రచారమూ ఉంది.
ఇక తాజాగా బయటకొస్తున్న సమాచారం ప్రకారం పోయిన ఎన్నికల్లో వచ్చిన నాలుగు సీట్లు కూడా రాకుండా జిల్లాలో పార్టీని చిన్నాభిన్నం చేయాలని వైవి కంకణం కట్టుకున్నారనే ఆరోపణా ఉంది. దీనికి ప్రత్యక్ష నిదర్సనం తాజాగా వైవి సుబ్బారెడ్డి మీద కొండపి వైసిపి నేత వరికూటి అశోక్ బాబు చేసిన విమర్శలే. అనుచరుల సమావేశం పెట్టిన అశోక్ బాబు వైవి తీరును తూర్పారబట్టారు. జగన్ తనకు చేస్తున్న అన్యాయానికి కారణం వైవి సుబ్బారెడ్డేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భాషలో చెప్పాలంటే పొగాకు మొక్కకు చేటు చేసే పొగమల్లెలా ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వైసిపికి తయారయ్యారని ఘాటుగా విమర్శించారు. ప్రకాశం జిల్లాలో వైసీపీని అంతం చేయడం ద్వారా జగన్‌కు చెడు చేస్తున్నాడని వైవి తీరును అశోక్ బాబు ఎండగట్టారు.
మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆస్తులు వైవీ రాయించుకుంటే జగన్ పిలిచి చీవాట్లు పెట్టి, తిరిగి ఆస్తులు ఇప్పించాడని చెప్పారు. చీము, నెత్తురు ఉంటే ప్రజాక్షేత్రంలోకి వైవీ రావాలని పరుషంగా మాట్లాడారు. అదీ సంగతి జిల్లాలో వైసిపిని సమూలంగా మట్టుబెట్టడానికి వైవి తీవ్రంగా కృషి చేస్తున్నారనేందుకు ఇంతకంటే నిదర్సనం ఇంకేమి కావాలి. ఒక నియోజకవర్గ ఇంచార్జి బహిరంగంగా నువ్వే జిల్లాలో వైసీపీకి పట్టిన చీడ అంటూ మాట్లాడుతుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిణామాలను బట్టి చూస్తే అన్ని జిల్లాల్లో తనకు తానుగా పార్టీని జగన్ నాశనం చేసుకుంటుంటే ప్రకాశం జిల్లాలో మాత్రం ఆ అవకాశం తన బాబాయికి ఇచ్చారా…! అన్నట్లు ఉంది.