చీరాల (DN5 News) : స్థానిక విఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కళాశాలలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది 46 మంది తమకు రావాల్సిన వేతనాల కోసం ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నా యాజమాన్యం స్పందించడం లేదని బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణంలో నిరసన చేపట్టారు. బాధిత ఉద్యగులు తమ న్యాయమైన హక్కులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలను యలమంచిలి గ్రూప్స్ ఆదీనంలోకి తీసుకున్న అనంతరం 46 మందిని విధుల నుంచి తొలగించారని తెలిపారు.
2019 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ వరకు 20 నెలల వేతన బకాయిలు రూ.80 లక్షలు ఉండగా ఇప్పటికి కేవలం 3నెలల జీతాలు మాత్రమే చెల్లించారని అన్నారు. మిగిలిన బకాయిల కోసం ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేదన్నారు. ఐదేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని తెలిపారు. యాజమాన్యం స్పందన లేదన్నారు. తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వెంటనే వేతన బకాయి చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జి రమేష్‌బాబు, వి శ్రీనివాస ప్రసాద్, వెంకట పద్మ, చేర్లిన కుమారి, శ్రీనివాసరావు, గిరీష్, మణికుమార్, శివరామకృష్ణ, ఫాతిమా, విశ్వేశ్వరరావు, పి రమేష్, ఎల్ బుల్లయ్య, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.






