బాపట్ల (DN5 News) : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన లేక మరణించిన బాధిత వ్యక్తుల కుటుంబాలకు నష్టపరిహారం త్వరితగతిన అందజేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను కోరారు. స్థానిక కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశం మందిరంలో రోడ్డు ప్రమాదాల నష్టపరిహారంపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన బాధిత వ్యక్తుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 12రోడ్డు ప్రమాదాల కేసులు నమోదైనట్లు చెప్పారు. అందులో 7 కేసుల్లో బాధిత కుటుంబ సభ్యులకు పూర్తి నష్టపరిహారం అందజేసినట్లు చెప్పారు. మిగిలిన 4కేసులకు సంబంధించి నష్ట పరిహారంపై అధికారులను ఆరా తీశారు. ఈ 4 కేసుల్లో ఒక కేసుకు సంబంధించి దస్త్రాలన్ని సిద్ధం చేసి భీమా కౌన్సిల్‌కు అందజేసినట్లు, త్వరలో నష్టపరిహారం బాధిత కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ఆర్‌టిఒ తెలిపారు. మిగిలిన 3 కేసులకు సంబంధించి సంబంధిత దస్త్రాలు సిద్ధం చేసి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని రేపల్లె ఆర్‌డిఒను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని బాధిత కుటుంబ సభ్యులు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌టిఒ పరంధామరెడ్డి, కలెక్టర్ కార్యాలయం మెజీస్టీరియల్ విభాగ సూపరింటెండెంట్ స్మక్ ఆజాద్ పాల్గొన్నారు.






