Home బాపట్ల పారదర్శకంగా ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ : కలెక్టర్‌ డాక్టర్‌ వి వినోద్‌కుమార్‌

పారదర్శకంగా ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ : కలెక్టర్‌ డాక్టర్‌ వి వినోద్‌కుమార్‌

6
0

బాపట్ల (DN5 News) : రాజకీయ పార్టీల నాయకులు, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో అత్యంత పారదర్శకంగా ప్రత్యేక సంక్లిప్త ఓటరు సవరణ జాబితా ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ కోరారు. స్థానిక కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక సంక్షిప్త ఓటరు సవరణ జాబితా జూన్ 15 నుండి జూలై 14వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో 2002 ఓటరు జాబితా 2025 ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేస్తున్నట్లు చెప్పారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్ జాబితాలోని ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసినట్లు చెప్పారు. ఎన్యుమరేషన్ ఫారాల వివరాలతో నింపి బిఎల్ఓకు అందచేయాలని తెలిపారు. అలా అందజేయని వారి వివరాలు ఈనెల 21న విడుదల చేసే డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్‌లో వారికి ఓటు హక్కు ఉండదని చెప్పారు. ఓటు హక్కు లేని వారు మరల ఫామ్-6 ద్వారా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కొత్తగా ఓటు నమోదు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

జిల్లాలో ఇప్పటివరకు 71.56 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు. అన్ కలెక్టెడ్ ఫారాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. బిఎల్ఓలను అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినట్లు నాయకులకు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకురావాలని కోరారు. రాజకీయ పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో బిఎల్ఓలతో పాటు ఉంటూ ఎన్యుమరేషన్ ఫారాల అందజేతలో దగ్గరుండి చూసుకోవాలని తెలిపారు. ఈనెల 14న ముగుస్తున్నందున, మిగిలిన 5 రోజుల్లోపు ప్రక్రియ పూర్తి కాదని, మరొక నెల రోజుల పాటు పొడిగింపు చేయాలని రాజకీయ పార్టీ నాయకులు కలెక్టర్‌ను కోరారు.

క్షేత్రస్థాయిలో బిఎల్‌ఒలు, బిఎల్ఎలకు సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడ ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వలేదు, మరణాలు, ఇల్లు మారటం వంటి వాటిని దగ్గరుండి చూసుకుంటూ ఏ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులు కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేస్తున్నారని, పార్టీల నాయకులు నిరంతరం అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారి వంతు కృషి చేయాలని చెప్పారు. మరణాలకు సంబంధించి ఓటు తొలగింపు విషయంలో బిఎల్ఒలు, బిఎల్ఎలతో సమన్వయం చేసుకొని చేయాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ షఫీ, టిడిపి, జనసేన, వైసిపి, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, బిఎస్‌పి, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు ఫరీద్, మాధవి, మాల్యాద్రి, సిహెచ్ గంగయ్య, బాల నారాయణ, రాజారాం, బాలాజీరెడ్డి పాల్గొన్నారు.