Home బాపట్ల ‘శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటి హాస్పిటల్‌’లో డాక్టర్‌ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం

‘శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటి హాస్పిటల్‌’లో డాక్టర్‌ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం

37
0

చీరాల (DN5 News) : శ్రీగోరంట్ల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ వైద్యసేవలు చీరాల, బాపట్ల ఎంఎల్‌ఎలు ఎంఎం కొండయ్య, వేగేశన నరేంద్రవర్మ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాళ్లిరువురు మాట్లాడుతూ పేదలకు కూటమి ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. చీరాల, బాపట్ల, పర్చూరు పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్యం మరింత చేరువైందని అన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.

హాస్పిటల్ ఎండి డాక్టర్ గోరంట్ల రాజేష్ ఆధ్వర్యంలో గుండె, నరాలు, కిడ్నీ తదితర అత్యవసర చికిత్సల కోసం గుంటూరు, విజయవాడ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చీరాలలోనే ఉచితంగా వైద్యం పొందే అవకాశం లభించిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సమయం అత్యంత కీలకమని అన్నారు. నరేంద్ర వర్మ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వైద్యం సేవా దృక్పధంతో చేయాలని సూచించారు. ధనవంతులపట్ల ఎక్కువ ఫీజులు వసూలు చేసుకున్న అభ్యంతరం లేదు కానీ పేదల విషయంలో ఆర్ధికంగా చూడకుండా సేవా దృక్పదంతో వైద్యం చేసి ఆదుకోవాలని సూచించారు.

హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ గత పదేళ్లుగా చీరాలలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలోనే తొలి 100 పడకల ఆస్పత్రిని అన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ తదితర విభాగాల్లో 24 గంటలూ సేవలు అందిస్తున్నామని చెప్పారు. గత ఏడాదిన్నర కాలంలో 300కుపైగా యాంజియోగ్రామ్‌లు, 100కు పైగా గుండె స్టంట్‌లు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

ఖరీదైన చికిత్సలు భరించలేక ఇప్పటి వరకు అనేక మంది ఆరోగ్యశ్రీ సేవల కోసం గుంటూరు, విజయవాడకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. విలువైన సమయం వృథా కావడంతో కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు ఎదురయ్యేవని పేర్కొన్నారు. ఇకపై డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల కింద గుండె యాంజియోగ్రామ్‌, స్టంట్‌, పేస్‌మేకర్లు, ఆర్‌ఎఫ్‌ఏ చికిత్సలు, థైరాయిడ్, లాపరోస్కోపిక్, హెర్నియా, అపెండిక్స్, పైల్స్, ఫిస్టులా, వారికోస్ వెయిన్స్ శస్త్రచికిత్సలు, టాన్సిల్స్, అడినాయిడ్స్, ముక్కు, చెవి శస్త్రచికిత్సలు, కిడ్నీ రాళ్లు, ప్రోస్టేట్, మూత్రనాళ సంబంధిత ఆపరేషన్లు, ఉచిత డయాలసిస్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎన్‌టిఆర్ వైద్య సేవ పరిధిలో లేని చికిత్సలు ఎంఎల్‌ఎల సిఫార్సుతో సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల నుండి ఉచితంగా చేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి, వైద్యులు, టిడిపి పట్టణ అధ్యక్షులు దోగుపర్తి సురేష్ పాల్గొన్నారు.