చీరాల : కుందేరుకు ఇరువైపులా నివాసం ఉంటున్న ప్రజలు మురుగు, దుర్వాసనతో గత వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులపై కుందేరు ప్రక్షాళన, కుందేరు కాలుష్యానికి కారణమైన డయ్యింగులపై చర్యలు తీసుకోవాలని వెంగళరావునగర్ ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యను కమీషనర్ షేక్ ఫజులుల్లాకు వివరించారు.
స్పందించిన మున్సిపల్ అధికారులు వెంగళరావునగర్‌ను పరిశీలించారు. దుర్వాసన, మురుగును తక్షణం తొలగించేందుకు తాత్కాలిక చర్యలు చేపట్టారు. సమస్య తెలుసుకున్న క్షణాల్లో స్పందించిన అధికారులు కుందేరు ఒడ్డున బ్లీచింగ్ చల్లారు. ఇళ్లకు సమీపంలో ఉన్న చెత్త, మురుగు తొలగించారు. తాత్కాలికంగా చర్యలు చేపట్టినప్పటికీ కుందేరుకు ఇరువైపుల నివాసం ఉంటున్న ప్రజలు భూగర్భ జలాలు కూడా కలుషితమైన వాడుక అవసరాలకు కూడా నీటి ఇబ్బందులకు గురవుతున్నారన్న అంశాన్ని సిపిఎం నాయకులు అధికారుల దృష్టికి తెచ్చారు.
కెఎస్ఆర్ హ్యాండ్లో నుండి వస్తున్న రసాయనాలతో కూడిన వ్యర్థ పదార్థాలు నేరుగా కుందేరులో వదలడం వల్లనే కుందేరులో ఉన్న చేపలు, కప్పలు, ఇతర నీటిజంతువులు మృతి చెందాయని కాలనీ వాసులు అధికారులు, సిపిఎం నాయకుల దృష్టికి తెచ్చారు. వీటి కారణంగానే గతంలో ఎన్నడూ లేనివిధంగా వారం రోజులుగా తీవ్రమైన దుర్వాసన వస్తుందని పేర్కొన్నారు. రసాయనాలతో కూడిన నీటిని వదలకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందని కోరారు. దీనితోపాటు కుందేరులో నీటి పారుదల ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండు చేశారు. నీటి పారుదల ఉంటేనే పట్టణ ప్రజలకు దోమలు, అంటురోగాల సమస్యకు కొత శాశ్విత పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ షేక్ ఫజులుల్లా, పారిశుద్య అధికారులు ఎండి బషీర్, రాంభూపాల్‌రెడ్డి, సిపిఎం నాయకులు లింగం జయరాజు ఉన్నారు.