Home ప్రకాశం సమస్యలు వింటూ..భరోసానిస్తూ… వైసిపి మాజీ ఎంపీ వైవి పాదయాత్ర

సమస్యలు వింటూ..భరోసానిస్తూ… వైసిపి మాజీ ఎంపీ వైవి పాదయాత్ర

490
0

– కనిగిరి నుంచి హాజీపురం క్రాస్ వరకు కొనసాగిన వైవీ పాదయాత్ర
– కదం తొక్కిన అభిమానులు, కార్యకర్తలు

కనిగిరి : “సార్… మాకు సొంతిళ్లు లేవు. తెలుగు దేశం పార్టీ వాళ్ళు మాకు మంజూరు కాకుండా అడ్డుకున్నారు. మీరైనా న్యాయం చేయండి సార్..” అంటూ మహిళలు… “వయసు మీద పడి… కన్న బిడ్డల నిరాదరణకు గురై అల్లాడుతున్నా పింఛన్ మంజూరు చేయడం లేదు” అంటూ వృద్ధులు తమ ఆవేదనను మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎదుట వెలిబుచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కోసం మంగళవారం ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజా పాదయాత్ర ప్రారంభ సభ అనంతరం కనిగిరి నుంచి శ్రీరంగపురం మీదగా హనుమంతునిపాడు మండలం హాజీపురం క్రాస్ వరకు కొనసాగింది.

ఈ సందర్బంగా ఆయన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, పక్కా గృహాలు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. మన ప్రాంతానికి వెలుగొండ నీళ్లొస్తే.. పది మందికి అన్నం పెట్టే స్థాయిలో వుంటామన్న భరోసానిచ్చారు. పది ఎకరాల రైతు కూడా బతుకు దెరువు కోసం వలస పోయే దుస్థితి పోవాలంటే వెలుగొండ పూర్తి చేసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. గ్రామాలలో రైతులు, కూలీల తోపాటు చేతి వృత్తుల వారు మనగలిగినప్పుడే పల్లెలు పచ్చగా ఉంటాయన్నారు.

అందరం కలిసికట్టుగా వెలుగొండ పూర్తి కోసం పోరాడదామని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్రలో పార్టీ సమన్వయ కర్త బుర్రా మధుసూదన్ యాదవ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నాయకులు కుందురు తిరుపతిరెడ్డి, ప్రసాద్ రెడ్డి, వైవీ భద్రారెడ్డి, చుండూరు రవిబాబు, రవనమ్మ, తమ్మినేని సుజాత, ఈశ్వరమ్మ, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.