ఢిల్లీ : మాజీ ప్రదాని అటల్ బిహారి వాజ్‌పేయీ ఆరోగ్యం మరింత క్షీణించింది. గడిచిన 24 గంటల్లో ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమించిందని డిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు బుధవారం రాత్రి ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని తెలిపారూ. వాజపేయిని పరామర్శించేందుకు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం రాత్రి ఎయిమ్స్‌కు వెళ్లారు.
తొలుత కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాత్రి పొద్దుపోయాక రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అభిమాన నేత ఆరోగ్యం మెరుగుపడడం లేదని తెలిసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు ఆత్రుతతో ఆయన గురించి తెలుసుకొనే ప్రయత్నాలు చేశారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రులు, ప్రధాని, ఎంపీలు ఆసుపత్రికి వస్తుండడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది.
‘దురదృష్టవశాత్తూ వాజ్‌పేయీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన క్లిష్ట పరిస్థితిల్లో ఉన్నారు’ అంటూ ఎయిమ్స్ నుంచి బులెటిన్ విడుదలయ్యాక అభిమానులు ఇంకా కలవరపడ్డారు. అనారోగ్యంతో జూన్ 11న ఎయిమ్స్‌లో చేరారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాలు, మూత్ర నాళాల సంబంధిత వ్యాధితోపాటు చిత్త వైకల్యం (డెమెన్షియా)తో ఆయన బాధ పడుతున్నారు.