Home ప్రకాశం విద్య‌, ఉపాధి విధానాల్లో మార్పు రావాలి : మాజీ మంత్రి బాలినేని

విద్య‌, ఉపాధి విధానాల్లో మార్పు రావాలి : మాజీ మంత్రి బాలినేని

519
0

ఒంగోలు : ” పాతికేళ్ల బిడ్డ కన్నవాళ్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే దుస్థితి పోవాలి. నిరుద్యోగాన్ని పెంచుతున్న మన విద్య, ఉపాధి విధానాల్లో మార్పు రావాలి. అది కేవలం జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌తోనే సాధ్యం“ అని మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సిపి జిల్లా అధ్య‌క్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో ఆదివారం జ‌రిగిన‌ కాలేజీ విద్యార్థుల ముఖాముఖిలో ఆయ‌న మాట్లాడారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఐటీ విధానం వల్ల పచ్చ చొక్కా పారిశ్రామిక వేత్తలు బాగుపడతారు తప్ప కళాశాలలో ఐటీ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థికి దోహదపడేట్లు లేదని చెప్పారు. ఐటీ కారిడార్‌ నెలకొల్పడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామన్నారు. వ్యవసాయమే అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి వ్య‌వ‌సాయ‌ రంగాన్ని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రెండో అతి పెద్దదైన పారిశ్రామిక రంగం పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్నారు. దొడ్డిదోవన తన వాళ్లకు లబ్ది చేకూర్చడం తప్ప ఓ పరిశ్రమ ద్వారా పదిమందికి ఉపాధి కల్పించాల‌న్న ధ్యాస బాబుకు లేద‌న్నారు.

జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పట్ల నాలుగున్నరేళ్ల నుండి ఆయన చూపించిన శ్రద్ధ ఏమిటో మనకు స్పష్టమవుతోందన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నందున హడావుడి చేయడం తప్ప ఆయన వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పారు. దొనకొండ కారిడార్‌ ఏమైందని ప్రశ్నించారు. కనిగిరి నిమ్జ్‌ను ఎంతవరకు తెచ్చారని నిలదీశారు. తమ హయాంలో పారిశ్రామిక వృద్ధి కోసం వ్యాన్‌పిక్‌ భూములు తీసుకుంటే.. దాన్ని అడ్డుకుంది చంద్రబాబేనని చెప్పారు. జిల్లా కేంద్రంలో విశ్వ విద్యాలయం కోసం తాము ప్రతిపాదిస్తే.. దాన్ని అడ్డుకున్న ఘనత టీడీపీ నేతలది కాదా అని ప్ర‌శ్నించారు. నాలుగేళ్ల నుండి యూనివర్శిటీ నెలకొల్పకుండా మైనింగ్‌, వెటర్నరీ, ఉద్యాన కళాశాలలంటూ మభ్య పెట్టడం తప్ప ఆచరణ ఏదని దుయ్యబట్టారు. తమ హయాంలోనే ఒంగోలులో రిమ్స్‌, రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ఒంగోలు నగర ప్రజలకు సమగ్ర మంచినీటి పథకాన్ని తీసుకొచ్చింది వైఎస్సార్‌ అని గుర్తుంచుకోవాలన్నారు. నేడు నాలుగు రోడ్లు, మురుగు కాల్వలు తవ్వించి ఇదే అభివృద్ధి అనే భ్రమల్లోకి ప్రజలను నెట్టేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి మాటున నొక్కేస్తున్న పర్సంటేజీల మాటేమిటని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారానికి వ‌స్తే అవసరమైతే ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో కాంగ్రెస్‌కైనా మద్దతిస్తామని చెప్పారు. తమకు కాంగ్రెస్‌తో ఉన్న విభేదాలకన్నా ప్రజా ప్రయోజనమే ముఖ్యమని వెల్లడించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రామాయపట్నం పోర్టును సాధిస్తామనే భరోసానిచ్చారు.

కార్యక్రమంలో వైఎస్ఆర్‌సిపి నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు, యువజన అధ్యక్షులు గంటా రాము, సేవాదళ్‌ నాయకులు పి. ఓబుల్‌రెడ్డి, విద్యార్థి నేతలు యశ్వంత్‌ రెడ్డి మాట్లాడారు. బాలినేని తనయుడు ప్రణీత్‌రెడ్డి వేదికపైకి ఎక్కి యువతలో జోష్‌ నింపారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అశోక్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, జిల్లా అభివృద్ధితోపాటు తమ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను బాలినేని దృష్టికి తీసుకొచ్చారు. వెలుగొండ ప్రాజెక్తు పూర్తి చేయ‌డం ద్వారా సాగు, తాగు నీరందిస్తే అక్కడ ప్రజలు భూమిలో బంగారం పండిస్తారని చెప్పారు. వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందితే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయని సమాధానమిచ్చారు.