Home క్రైమ్ ఝార్ఖండ్‌ మాజీ మంత్రి మ‌జాకా… వాట్సాప్‌లో విచారించిన‌ న‌్యాయ‌మూర్తిపై సుప్రీం కోర్టు ఆగ్ర‌హం

ఝార్ఖండ్‌ మాజీ మంత్రి మ‌జాకా… వాట్సాప్‌లో విచారించిన‌ న‌్యాయ‌మూర్తిపై సుప్రీం కోర్టు ఆగ్ర‌హం

421
0

డిల్లీ : కోర్టులో ఫోన్ మాట్లాడం నేరం. ఫోటోలు తీయ‌డం అంత‌క‌న్నా నేరం. విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎవ్వ‌రైనా ఫోన్ బ‌య‌ట‌కు తీసినా, వీడియో తీసినా జ‌డ్జివారికి వ‌చ్చే కోపం అంతా… ఇంతా కాదు. తెలిసీ తెలియ‌క ఓ విలేక‌రి కోర్టు హాలులో విచార‌ణ తంతును ఫోటో తీసినందుకు జ‌డ్జిగారి ఆగ్ర‌హానికి గురై రూ.600అప‌రాధ రుసుం చెల్లించాల్సి వ‌చ్చింది. అలాంటిది జ‌డ్జిగారే వాట్సాప్ ఫోన్ ద్వారా వీక్షిస్తూ కేసు విచార‌ణ చేశారు. అందులోనూ ఓ క్రిమినల్‌ కేసులో కోర్టు విచారణ వాట్సాప్‌లో చేశార‌ని వినడానికి వింతగా అనిపిస్తున్న ఇది మాత్రం నిజ‌మే. ఇదేదో విదేశాల్లో జ‌రిగిన ఘ‌ట‌న కాదు. అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన మ‌న‌దేశంలోనే…

వాట్సాప్ కాల్ ద్వారా విచార‌ణ చేసిన‌ విచిత్రమైన కేసు తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ తీరు తెలుసుకున్న‌ న్యాయమూర్తులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘విచార‌ణ‌మేపైనా జోక్‌ అనుకుంటున్నారా.. న్యాయస్థానంలో ఇలాంటి పద్ధతులను ఎలా అనుమతించారు?’ అంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు ఏం జరిగిందంటే..

ఝార్ఖండ్‌ మాజీ మంత్రి యోగేంద్ర సావోతోపాటు ఆ రాష్ట్ర‌ ఎమ్మెల్యే అయిన ఆయన భార్య 2016నాటి అల్ల‌ర్ల‌ కేసులో నిందితులుగా ఉన్నారు. ఏప్రిల్ 19న వీరిపై ఉన్న కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. హజారిబాగ్‌లోని కోర్టు న్యాయమూర్తి వీరిపై ఓ వాట్సాప్‌ కాల్‌ ద్వారా అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో వీరిద్ద‌రికీ గత ఏడాది సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. భోపాల్‌లో నివాసం ఉంటూ విచార‌ణ నిమిత్తం మాత్ర‌మే ఝార్ఖండ్‌కు రావ‌చ్చ‌ని షరతు విధించింది. అనంతరం భోపాల్‌లోని జిల్లా కోర్టు నుండి ఝార్ఖండ్‌లోని హజారిబాగ్‌ జిల్లా కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసు విచార‌ణ నిర్వహించారు. అయితే గ‌త ఏప్రిల్ 19న‌ ఈ రెండు కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ దృశ్య‌నాణ్య‌త‌ తక్కువగా ఉండటంతో వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా న్యాయమూర్తి విచారణ చేపట్టార‌ని, అభియోగాలు నమోదు చేశారని మాజీ మంత్రి దంపతుల తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

వాట్సాప్‌ ద్వారా విచార‌ణ‌ చేపట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‌ఎ బాబ్డే, ఎల్‌ఎన్‌ రావులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మండిపడింది. ‘ఏమి జరుగుతోంది ఝార్ఖండ్‌లో. ఇలాంటి పద్ధతులను అంగీకరించేదిలేదు. న్యాయస్థానాలకు అప్ర‌తిష్ట తెచ్చే చర్యలను అనుమ‌తించేది లేదు. ఇలాంటి పద్ధతుల్లో విచారణ జరగకూడదు. కేసు విచారణేమైనా జోక్‌ అనుకుంటున్నారా?’ అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది.