చీరాల : ప్రధాని నరేంద్రమోడీ తుగ్లక్ విధానాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీను ఆరోపించారు. బిజెపి అధికారానికి వచ్చిన తర్వాత నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ప్రజల జీవితాలను అతలాకుతలం చేయడానికి నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెవ్వుల్లో పువ్వులు పెట్టుకుని కొట్లబజారులోని సెంట్రల్ బ్యాంకు ఎటిఎం ఎదుట శనివారం నిరసన వ్యక్తం చేశారు.
అధికారానికి వస్తే నల్లధనం వెలికితీస్తానని బూటకపు మాటలు చెప్పి నోట్ల రద్దుతో సామాన్యులను ఇబ్బందులు పెట్టారన్నారు. బ్యాంకుల్లో డబ్బు ఉండి తీసుకునేందుకు అవకాశం లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. బ్యాంకు ఖాతాలు ఎత్తేసుకుని నగదు ఇళ్లలోనే దాచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. దీనివల్ల నగదు చెలామణి లేక అవసరానికి నగదు అందక ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గజవల్లి సాయి, రత్నబాబు, సంతోష్, లక్ష్మయ్య, ఆర్ సాయి పాల్గొన్నారు.