చీరాల : ముంతావారిసెంటర్‌లోని యూనియన్ బ్యాంకులో మత్య్సకారులకు వలలు ఇప్పిస్తామని నమ్మించి మద్యవర్తులు, వలల డీర్లతో కుమ్మక్కై బ్యాంకు మేనేజర్ తలతోటి సురేష్ అవినీతికి పాల్పడినట్లు వాడరేవు, అడివీధిపాలెం, కటారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామాల మత్య్సకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమవద్ద ఒక్కొక్కరి నుండి రూ.2నుండి రూ.3వేలు తీసుకుని బ్యాంకు కాతాలు ప్రారంభింపజేసి ఒక్కొక్కరికి రూ.70వేల విలువైన వలలు ఇచ్చి రూ.లక్ష రుణం ఇచ్చినట్లు రికార్డుల్లో రాసుకుని మిగిలిన సొమ్మను మేనేజర్ తాను ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరికి రూ.65వేల నుండి రూ.80వేల వరకు నగదు ఇచ్చారని, మరికొందరికి అస్సలు పైసా ఇవ్వకుండా రుణం ఇచ్చినట్లు సంతకాలు చేయించుకున్నారని పోలీసులకు వివరించారు. ఇలా బ్యాంకు పరిధిలో 1555మందికి రుణాలు మంజూరు చేసి రూ.4.50కోట్లు దుర్వినియోగం చేశారని పోలీసుల ప్రాదమిక విచారణలో తేలినట్లు డిఎస్‌పి వల్లూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
మత్య్సకారులను విచారించి ప్రాధమిక సమాచారం తీసుకుని నిర్ధారణకు వచ్చిన అనంతరొ కొత్తపేటలో నివాసం ఉంటున్న బ్యాంకు మేనేజర్ సురేష్‌బాబును అతని ఇంటి వద్ద మద్యవర్తుల సమక్షంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. అతనివద్ద బ్యాంకు అవినీతికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మరికొందరు ముద్దాయిలు పారారీలో ఉన్నట్లు తెలిపారు. పరారైన వారి కోసం తమ సిబ్బంది గాలిస్తున్నారని చెప్పారు. కేసు విచారణలో చురుకుగా వ్యవహరించిన చీరాల రూరల్ సిఐ భక్తవత్సలరెడ్డిని డిఎస్‌పి అభినందించారు.