నల్గొండ : మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసును పోలీసులు ఛేదిస్తున్నారు. కేసు విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. ప్రణయ్‌ని హత్య చేయించాడన్న ఆరోపణలెదుర్కొంటున్న అమృత తండ్రి మారుతిరావుతోపాటు మరోఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమృత తండ్రి మారుతిరావే హత్య చేయించినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. హత్య చేసిన అనంతరం నిందితులు కారులో పారిపోయినట్లు హరదారివెంట సిసి ఫుటేజిల ద్వారా పోలీసులు గుర్తించారు. కారు ఆధారం చేసుకుని పోలీసులు దర్యాప్తు చేశారు. టోల్‌గేట్ల వద్ద సిసి ఫుటేజిల ఆధారంగా కారు ఎటువెళ్లిందనేది గుర్తించి మారుతీరావును అదుపులోకి తీసుకున్నారు.
సినిమా తర్పహాలో పథకం ప్రకారం ప్రణయ్‌ని హత్య చేశారు. ప్రణయ్ ఇంటి ముందు శుక్రవారం రెక్కీ నిర్వహించారు. ప్రణయ్ కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టారు. ఇంటి నుండి భార్య అమృతను తీసుకుని ప్రణయ్ కారులో ఆసుపత్రికి బయలుదేరగానే నిందితులు బైక్‌పై వెంబడించారు. వెంబడిస్తున్న సమాచారం ఫోన్లో మరొకరికి చెప్పారు. ఆ దృశ్యాలన్నీ ప్రణయ్ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆసుపత్రికి వచ్చాన ప్రణయ్‌పై నిందితులు అదును చూసుకుని దాడి చేసి అత్యంత క్రూరంగా మెడ నరికి చంపేశారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చర్చిబజార్ నివాసి ఎస్సీ(మాల) సామాజిక వర్గానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్(24) బీటెక్ పూర్తి చేశాడు. కెనడా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రణయ్ తండ్రి బాలాస్వామి మిర్యాలగూడలోని ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నాడు. అదే పట్టణానికి చెందిన రియల్టర్, బిల్డర్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన తిరునగరు మారుతిరావు ఏకైక కుమార్తె అమృత. ఆమె బీటెక్ చదువుతోంది. ప్రణయ్, అమృత ఇద్దరూ హైదరాబాద్‌లో ఇంటర్ చదివే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. విషయాన్ని ఇద్దరూ కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. కులాలు వేరు కావడంతో అమృత తండ్రి మారుతిరావు వీరి పెళ్లికి అంగీకరించలేదు. తన కూతురిని వదులుకుంటే రూ. 3కోట్లు ఇస్తానని ప్రణయ్‌కు ఆశచూపాడు. అయితే అమృతపై తనకున్న ఇష్టం డబ్బుతో కొలిచేది కాదని ఇంటి నుండి తీసుకెళ్లిన ప్రణయ్.. హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో గత జనవరి 31న ఆమెను పెళ్లిచేసుకున్నాడు. కుల అహంకారానికి బలయ్యాడు.
ఏ స్థాయికెళ్లినా…
ఆర్ధికంగా స్థిరపడితేనో, ఉన్నతమైన చదువుకుంటేనో సమాజంలో సమాన హోదా వస్తుందనుకుంటే పొరపాటేనని ప్రణయ్ హత్య ఉదంతం హెచ్చరిస్తుంది. తర తరాలుగా వేళ్లూనుకుని ఉన్న కులం, మతం అడ్డుగోడలను చదువు, ఆర్ధిక స్థోమత చెరిపేస్తాయనుకుంటే ఏం జరుగుతుందనేందుకు ఈఘటనే ఉదాహరణ. భారతీయ సమాజం మానసిక సమానత్వానికి ఆమడ దూరంలో ఉంటే టివిలు, సినిమాలు చూసి తెల్లారేసరికి మారిపోతుందని బ్రమపడేవారిని హెచ్చరించడమే కాదు… భయానక పరిస్థితులను చూపుతున్నాయి. ప్రేమించి పెళ్లిచేసుకోవడం నేరంగానో, పరువు పోయిందనో భావిస్తున్న వాళ్లు తమపెంపకాన్నీ ప్రశ్నించుకోరా? హత్య చేస్తే పోయిన పరువు తిరిగి వస్తుందా? మనసుకు తగిలిన గాయం మానితే మీ బిడ్డ మీ కళ్లమందే కనిపిస్తుంది? కానీ హత్యకుగురైనా ఆ కటుంబంలో ఎప్పటికీ వెలుగు రాదుకదా?