వేటపాలెం : వేటకు వెళ్లిన భర్త తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న ఆమెకు భర్త ఇకలేడని తెలిసి గుండెలవిసేలా ఒక్కపెట్టున పెట్టిన ఏడుపు చూపరులను కలచివేసింది. రోజూ తీరం వెంట చేపల వేలంతో కళకళలాడే మత్య్సకారుల ముఖాల్లో విషాదం అలుముకుంది. అప్పటి వరకు తమతోటి ఉన్న మత్య్సకారుడు ఒక్కసారిగా పడవ బోల్తా పడటంతో విగతజీవి అయ్యాడు. ఘటన వేటపాలెం మండలం కఠారివారిపాలెం తీరంలో సోమవారం చోటు చేసుకుంది. బోటు ఇంజన్ చెడిపోయి రివర్స్ తిరగడంతో పడవ ప్రమాదానికి గురైంది. ప్రమాదంలోని బోటులోని నలుగురు జాలర్లు తప్పించుకోగా ఒకరు మృత్యువాతపడ్డారు.
మండలంలోని కఠారివారిపాలెంకు చెందిన మత్య్సకారుడు కఠారి చిన్నకొండలరావు రోజుటిలాగానే చేపల వేటకు సముద్రంలోకి వెళ్లాడు. ప్రమాద వశాత్తు పడవ బోల్తాపడింది. ప్రమాదంలో మత్య్సకారుడు కొండలరావు(39) మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన తోటి మత్య్సకారులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితంలేదు. ఒడ్డుకు చేర్చినప్పటికీ అప్పటికే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.