చీరాల : ప్రత్యేక హోదా ఇవ్వడం జాతీయ పార్టీ అయిన కాంగ్రెసుకె సాద్యమని మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. చీరాల పర్యటనకు వచ్చిన ఆమె కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ మెండు నిశాంత్ నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. సెప్టెంబర్ రెండు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి కాంగ్రెస్ – ఇందిరమ్మ సౌభాగ్యం నినాదంతో ప్రతి గడపకీ తిరగాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందిని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి గడపకు వెళ్లి కాంగ్రెస్ పథకాలను వివరించి వారి వద్ద నుండి ఒక రూపాయి వసూలు చేయాలన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. బీసీలకు ఎటువంటి నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. బిసీలతో సంప్రదింపులు జారుపుతామన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆమె కోరారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. కార్యక్రమంలో సయ్యద్ అలిమ్ బాబు, గుంటి ఆదినారాయణ, గుంటిరెడ్డి శశికళ, తానికొండ రమేష్, కోట వంశీకృష్ణ, బి చంద్రశేఖర్ పాల్గొన్నారు.