ఒంగోలు : నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం రైస్‌మిల్లర్స్ ఫంక్షన్ హాల్లో అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి సినీ గీతాలతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మహానటి సావిత్రి కుమార్తె, అల్లుడు విజయ చాముండేశ్వరి, గోవిందరావు దంపతులు, సిని నిర్మాత, హీరో, దర్శకులు గిరిబాబు, ప్రజా నాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న), రిటైర్డ్ ఆంధ్రాబ్యాంక్ డిజిఎం కెఎస్‌పివి రమణమూర్తి, రెవిన్యూ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రరసం అధ్యక్షులు బి హనుమారెడ్డి, శిద్దా వెంకటేశ్వరరావు, మండవ శ్రీనివాసరావు, డాక్టర్ మాచరాజు రామచంద్రరావు మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన సినిమాలన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందాయన్నారు. వారిద్దరి నటనతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రనేసుకున్నాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత పోన్నూరి శ్రీనివాసులు వాఖ్యతగా వ్యవహరించారు. తొలుత అక్కనేని నాగేశ్వరరావు, సావిత్రి, కళ్ళగుంట వెంకటేశ్వర్లు చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం విశిష్ట అతిధులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కళాకారులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కార్య్రకమంలో కళాపరిషత్ అధ్యక్షులు కళ్ళగుంట కృష్ణయ్య, సయ్యద్ ఇస్మాయిల్, కళ్ళగుంట శ్రీనివాసరావు, గాయనీ గాయకులు విజయ్, పూర్ణిమ, మురళి పాల్గన్నారు.