చీరాల : మైనర్ బాలిక… మంచిగా మాటలు చెప్పాడు. నమ్మించి వెంటబెట్టుకుని కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఈ ఘటన గతనెల 4న మార్టూరు మండలం వలపర్లలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ముకిరి దేవదానం మార్టూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుని ఫిర్యాదును పోలీసులు విచారించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఖాజా గ్రామానికి చెందిన కుర్రా గోపికృష్ణ తెలివిగా పోలీసులకు దొరకకుండా సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు మార్చుకుంటూ పట్టణాలు మారుతూ ఉన్నాడు. అది గమనించిన పోలీసులు వల పన్నారు.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రేపల్లె, పొన్నూరు, నిడుబ్రోలు, రేణిగుంట, తిరుపతి, కడప చివరికి వారణాశి (కాశీ)కి కూడా బాలికను తీసుకుని వెళ్ళాడు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు చీరాల డిఎస్పీ డాక్టర్ జి ప్రేమకాజల్ పర్యవేక్షణలో వలపన్ని ముద్దాయిని పట్టుకున్నారు.
ముద్దాయి మార్టూరు మండలం కోణంకి వద్ద ఉన్నట్లు అందిన సమాచారంతో ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ ప్రేమకాజల్ తెలిపారు. ఆదివారం సాయంత్రం చీరాలలో తన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాల్ని వెల్లడించారు. సమావేశంలో మార్టూరు ఎస్ఐ పాల్గొన్నారు. ముద్దాయిని సోమవారం అడ్డంకి కోర్టులో హాజరుపర్చనున్నారు.