తెనాలి : చదువు కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయ్యాక అయ్యడే బ్యాంకు ఉద్యోగం పొందాడు. అమెరికాలోనే స్థిరపడటంతో తల్లిదండ్రులూ ఆనందపడ్డారు. ఇక వివాహం చేస్తే బాధ్యత తీరుతుందనుకున్నారు. తమ భావి జీవితానికి కొడుకు ఆసరా అవుతాడని ఆశపడ్డారు. ఇంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో ఆ యువకుడు మృతి చెందాడు. అతనితోపాటు మరో ఇద్దరూ మృతి చెందారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం నింపింది.
గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన కందేపి పృద్వీరాజ్(26) ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడే చదువు పూర్తి చేసుకుని పెన్సినాటిలో బ్యాంకు ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం చేస్తూ రోజుటిలాగానే గురువారం సాయంత్రం బ్యాంకు విధులు ముగించుకుని ఇంటికెళ్లేందుకు బ్యాంకునుండి బయటికొస్తున్నాడు. అంతే అదే సమయంలో దోపిడీ దొంగలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో పృద్వీరాజ్‌తోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు.
పృథ్వీరాజ్‌పై కాల్పుల సమాచారం తెలియడంతో తెనాలి చెంచుపేటలో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగారు. పృథ్వీరాజ్ తండ్రి ఎపి గృహ నిర్మాణ సంస్థలో డిప్యూటీ ఇంజినీరుగా గతంలో హైదరాబాద్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన అమరావతిలోని గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయనకు పృథ్వీరాజ్‌తో పాటు కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో స్థిరపడటంతో వివాహం చేయాలనుకున్నాడు. వివాహ ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈ సమయంలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించని ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగింది. ప్రమాద ఘటనపై పృద్వీరాజ్ బంధువులు.. అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు, బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్నారు. పృథ్వీరాజ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు.