వైద్యవిభాగం : ఆధునిక జీవన విధానంలో మోకాళ్ల నొప్పులు 40ఏళ్లు దాటిన వారికి కూడా వస్తున్నాయి. 55-60ఏళ్ల వయస్సులో అయితే మోకాళ్ల నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటుంది. ప్రధానంగా మోకాలిలోని కీలు – ఎముకల మద్య కదలికలు మృదువుగా ఉండే విధంగా చూసే సున్నితమైన మృదులాస్థి పొరలు అరిగిపోవటం కారణంగానే ఎక్కువ మందికి మోకాలు నొప్పులు వస్తుంటాయని చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకలు, కీళ్ల వైద్యనిపుణులు డాక్టర్ చలువాది వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మోకాళ్ల నొప్పులు తీవ్రమై నడక నరకంగా భావించి కదల్లేకపోయే పరిస్థితి వస్తుందన్నారు. ఈ నొప్పుల నివారణకు యుక్తవయస్సు నుండే వ్యాయామ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పారు. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలన్నారు. నడక, వ్యాయామం వారానికి ఒకరోజు విపరీతంగా చేయడం కాకుండా కొద్దిపాటి వ్యాయామమైనా క్రమం తప్పకుండా రోజూ చేయాలన్నారు. అలా చేయడం వల్ల మోకాళ్ల వద్ద కండపెరిగి శరీర భారం మోకాళ్లపైనే మొత్తం భారం పడకుండా ఉంటుందని సూచించారు. శారీరక శ్రమ తగ్గితే బరువు పెరిగి మోకాళ్ల నొప్పులు మరింత సతాయిస్తాయన్నారు. పెద్దవయసులో సాధ్యమైనంత వరకూ బరువు పెరగకుండా చూసుకోవటం మంచిదన్నారు.
బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలని సూచించారు. బరువు తగ్గితే మోకాళ్ల మృదులాస్థి అరిగిపోయే ముప్పు కొంతమేరకైనా తగ్గుతోందని చెప్పారు. ‘ఫ్రేమింగ్‌హ్యామ్ ఆస్టియోఆర్త్థ్రెటిస్’ అధ్యయనంలో అరుగుదలను స్పష్టంగా గుర్తించారని పేర్కొన్నారు. కొద్దిగా మోకాళ్ల నొప్పులున్నా కదలికలు మానెయ్యకూడదని సూచించారు. రోజువారీగా ఓ మోస్తరు నడక, వ్యాయామాలు కొనసాగించాలని చెప్పారు. సాధ్యమైనంతవరకు గొంతిక్కూర్చోవడం మానుకుంటే మంచిదని చెప్పారు. మడమ ఎత్తు చెప్పులు (హైహీల్స్) వాడకుండా ఉండటం మంచిదని పేర్కొన్నారు. ఇప్పుడు మోకాళ్ల నొప్పులకు మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్యులను సంప్రదిస్తే పరీక్షలు చేసి, సమస్య ఏ స్థాయిలో ఉందో గుర్తించి తగిన వైద్యం అందిస్తారని చెప్పారు.