చీరాల (DN5 News) : సిఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు రూ.25వేల పెట్టుబడి సాయం తక్షణమే విడుదల చేయాలని ఎపి చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురుగుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక చేనేత జౌళి శాఖ జిల్లా కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పథకంలో ప్రభుత్వం విధించిన నిబంధనలతో గందరగోళం నెలకొన్నదని అన్నారు. అర్హులైన చేనేత కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి నిబంధనలు సరళతరం చేసి నేత నేస్తున్న ప్రతి కార్మికుడికి అనుబంధ వృత్తులు నిర్వహిస్తున్న వారికి ఉచిత విద్యుత్ పథకం వర్తింప చేయాలని కోరారు.
సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. జిఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని కోరారు. ఇల్లు లేని చేనేత కార్మికులకు 3సెంట్ల స్థలంలో షెడ్‌తో కూడిన ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ బాబురావు మాట్లాడుతూ చేనేత కార్మికుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చేనేతల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు.
చేతివృత్తుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పి కొండయ్య మాట్లాడుతూ వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అన్నారు. చేనేత రంగం నిర్లక్ష్యానికి గురవుతోందని అన్నారు. భవిష్యత్తులో వృత్తిదారులు ఐక్యంగా సమస్యల పరిష్కారానికి పోరాడాలని కోరారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గద్దె హేమసుందరరావు, డి సత్యనారాయణ, డి నాగమల్లేశ్వరరావు, చేనేత నాయకులు ఎం రంగయ్య, టి సత్యనారాయణ, అనుభవం వెంకటేశ్వర్లు, సుధాకర్, చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు అండగుండ నారాయణ, శేఖర్, ఐవి ప్రసాద్ పాల్గొన్నారు.






