పట్నా: బిహార్‌కు చెందిన సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి కుమారి మజ్ను భర్త చంద్రేశ్వర్ వర్మ బాలికల వసతి గృహానికి వెళ్లివస్తుండేవారని సీపీవో (బాలల సంరక్షణాధికారి) రవికుమార్ భార్య శిబా కుమారి మీడియా ద్వారా తెలిపారు. ‘చంద్రేశ్వర్ మంచివాడు కాదు. బాలికల వసతి గృహానికి తనతో పాటు ఓ అధికారిని కూడా తీసుకువెళ్లేవాడు. అధికారిని కింద కూర్చోబెట్టి అతను మాత్రం వసతి గృహంలోకి వెళ్లేవాడు. వసతి గృహంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, అందులో నివసిస్తున్న బాలికలను వేరే భవనానికి తరలించాలని పై అధికారులను నా భర్త లేఖ రాశారు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. దానికి తోడు నా భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనలో సీబీఐ విచారణ జరపాలని కోరుకుంటున్నాను’ అని శిబా తెలిపారు.
బిహార్‌లోని ఓ బాలికల వసతి గృహంలో నివసిస్తున్న 20 మంది బాలికలపై అత్యాచారం చేసిన సంఘటన బీహార్‌లో సంచలనం కలిగించింది. అత్యాచారాలకు పాల్పడింది కాక ఓ బాలికను హత్యచేసి, మృతదేహాన్ని పాతిపెట్టడంతో ఘటన కాస్తా పార్లమెంట్‌లోనూ చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఓ కీలక విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
బాలల సంరక్షణాధికారి రవికుమార్ భార్య శిబా కుమారి చేస్తున్న ఆరోపణలపై మంత్రి భర్త చంద్రేశ్వర్ వర్మ స్పందించారు. రెండేళ్ల క్రితం తన భార్య మంత్రి అయిన తర్వాతే తాను వసతి గృహానికి వెళ్లానన్నారు. ఆ తర్వాత ఇంకెప్పుడూ వెళ్లలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సిఫార్సు వస్తే సీబీఐ దర్యాప్తు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.