ఒంగోలు : ప్రజా సమస్యల పరిష్కారం కేవలం వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా సుజాతానగర్‌లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా బాలినేని మాట్లాడుతూ అధికార టిడిపి ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. జగన్ ప్రకటించిన నవరత్నాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా రూ.లక్ష నుండి రూ.10లక్షలు, పింఛన్ల పెంపు ద్వారా రూ.24వేల నుండి రూ.48వేలు ఏటా పేదలకు లబ్ది చేకూరుతుందన్నారు.
పేదలకు సొంతిల్లు ఏర్పాటు చేయడం ద్వారా రూ.2 నుండి రూ.5లక్షలు, వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.50వేలు, వైఎస్సార్ చేయూత ద్వారా రూ.75వేలు, అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15వేల చొప్పున ప్రతీ కుటుంబానికి లబ్ది చేకూరుస్తామని వివరించారు. కార్యక్రమంలో వైసిపి నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు, అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మహిళా అధ్యక్షులు గంగాడ సుజాత, అరుణ, పురిణి ప్రభావతి, పోకల అనురాధ, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్, వేమూరి బుజ్జి, కటారి ప్రసాద్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కఠారి శంకర్, ఎస్‌కే మహ్మద్ రఫీ, మట్టే రాఘవ, తోటపల్లి సోమశేఖర్ పాల్గొన్నారు.