విశాఖపట్టణం : అరకు ఎంఎల్ఎ కిడారి సర్వేస్వరరావు, మాజీ ఎంఎల్ఎ సివేరి సోమలను మావోయిస్టులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. గత కొంతకాలంగా మావోలనుండి హెచ్చరికలు వస్తున్నట్లు ప్రభుత్వ నిఘావిభాగం అధికారులు చెబుతూనే ఉన్నారు. మావోల నుండి ఎందుకు హెచ్చరికలు వస్తున్నాయి. ఏం హెచ్చరికలు చేస్తున్నారు? ఆ ప్రశ్నలు వస్తున్నాయి. ఇంటిలిజెన్స్ అధికారులు వంటరిగా వెళ్లవద్దని హెచ్చరించినప్పటికీ ఎందుకు వెళ్లారు.
ఆదివారం ఉదయం అరకు ఎంఎల్ఎ కిడారి సర్వేస్వరరావు, ఆయన అనుచరుడైన మాజీ ఎంఎల్ఎ సివేరి సోమ తమ కార్యకర్తలతో కలిసి బస్సులో బయలు దేరారు. డుంబ్రీగూడ మండలం లిప్పిటిపుట్ట దగ్గరకు వెళ్లేసరికి వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని సాయుధలైన మావోయిస్టులు అడ్డగించారు. బస్సులో ఉన్నఇతరులందరినీ వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. దీంతో అందరూ వెళ్లిపోయారు. ఎంఎల్ఎ కిడారి, సోమలను మాత్రమే కూర్చోబెట్టారు. సుమారు అర్ధగంటపాటు చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరినీ నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు. అయితే అర్ధగంటపాటు ఏం చర్చించారనేది మావోలు చెప్పాల్సిందే. అయితే గతంలో బాక్సైటు తవ్వకాలకు అనుకూలంగా పనిచేయవద్దంటూ మావోయిస్టులు వీరిద్దరినీ వివిధ సందర్భాల్లో హెచ్చరించినట్లు సమాచారం.