అమరావతి : సోము వీర్రాజుకు పదవి ఇస్తే పార్టీలో తిరుబాటు తధ్యం… ఇది కొన్ని రోజుల కిందట బీజేపీ ఏపీలోని కొందరు నేతలు అమిత్ షాకు ఇచ్చిన అల్టిమేటం. అయితే ఇప్పుడు సోమును అధ్యక్షుడిని చేయకున్నా ఆ పార్టీలో చీలిక వచ్చేసింది. అసలు అధ్యక్ష పదవి కోసం కొన్ని నెలలుగా చంద్రబాబు మీద నోరు పారేసుకుని కలలు కన్న ఆ సోము వీర్రాజే ఇప్పుడు గాయబ్ అయ్యారు. పార్టీ వీడి వెళ్తున్నట్లు ప్రకటించిన అరువు నేత కాంగ్రెస్ మాజీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణకు అధ్యక్ష పదవి ప్రకటించగానే అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తానని వీర్రాజు ప్రకటించారు. అయితే సాయంత్రానికే సోము మనసు మారిపోయింది. రాత్రి పొద్దుపోయేసరికి ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. పొద్దున అమిత్ షా ప్రకటనను స్వాగతిన వీర్రాజు రాత్రికి అజ్ఞాతంలోకి పోవడం బీజేపీ ఢిల్లీ నేతలని దిగ్భ్రాంతికి గురి చేసింది.
వాస్తవానికి కన్నాకు అధ్యక్ష పగ్గాలు అప్పగించినా అదే సమయంలో ఆ పదవి ఆశించిన సోము వీర్రాజుకు కూడా న్యాయం చేయాలని ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నించింది. ఆయనను ఎన్నికల కమిటీ చైర్మన్ ని చేసింది. ప్రకటన వచ్చిన వెంటనే ఆ పదవితో సంతృప్తి పడిన సోము సాయంత్రానికి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ధిక్కార స్వరం వినిపించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే తన వర్గాన్ని రంగంలోకి దించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం. ఆయనకు నిజంగానే అసంతృప్తి వ్యక్తం చేయకుండా సమస్య ఏమిటో చెప్పకుండా ఇలా అజ్ఞాతంలోకి వెళ్లి ఏం సాధించాలనుకున్నారో వీర్రాజుకె తెలియాలి.
ఇక సోము సైలెంట్ కాగానే వీరాజు వర్గంగా ముద్ర పడిన నేతలు రంగంలోకి దిగారు. తామంతా అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నిరసన స్వరం వినిపించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు, రాజమండ్రి బీజేపీ అధ్యక్షుడు సహా కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే రాజీనామా పత్రాలను అమిత్ షాకు పంపినట్లు తెలిసింది. వీరితో పాటు అదే జిల్లాలోని మరికొందరు నేతలు కూడా రాజీనామాలు ప్రకటించినట్లు చెబుతున్నారు.
వీరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సోము వీర్రాజు తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఇప్పుడు వారందరి ద్వారా అధిష్టానం మీద ఒత్తిడి తేవాలని చూస్తున్నారని తెలుస్తోంది. గతంలో సోము వీర్రాజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించారు. ఆ సందర్భంలోనే తనకంటూ ఒక వర్గాన్ని పెంచి పోషించారని సమాచారం. ఇప్పుడు వాళ్లంతా సోము కోసం రాజీనామాలు ప్రకటించి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెస్తారని చెబుతున్నారు. మరి సోము వీర్రాజు, ఆయన వర్గం చేస్తున్న ఒత్తిడికి బీజేపీ పెద్దలు దిగి వస్తారో… లేక వీరినే దారికి తెచుకుంటారో వేచి చూడాల్సిందే.