– వీడియోల టాంపరింగ్ పవన్ పనే… పోలీస్ కేసు నమోదు
హైద్రాబాద్ : తనపై కొన్ని ఛానళ్లు కుట్రలు చేస్తున్నాయని పవన్ మొదలు పెట్టిన ట్విట్ల పోరాటం ఎదురు తంతోంది. ఆయన విసిరిన ఆయుధాలు రివర్సులో వచ్చి పవన్ కె తగులుతున్నాయి. నాపై మీడియా కుట్ర ఇదుగో సాక్ష్యం అంటూ పవన్ పెట్టిన వీడియోలు టాంపరింగ్ చేసినట్లు తేలింది. ఈ విషయాన్ని ఎవరో ఆరోపించడం కాదు పోలీసులే ధృవీకరిస్తున్నారు. ఏబీఎన్, టీవీ9 ఛానళ్ల మీద పవన్ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయా ఛానళ్లు, పాత్రికేయ సంఘాలు పవన్ మీద పోలీసులకు ఫిర్యాదులు చేసాయి. వాటిని స్వీకరించిన పోలీసులు పవన్‌పై ఐపీసీ 469 , 504 ,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పవన్‌కళ్యాణ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను ట్యాంపరింగ్ చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు.
పవన్ వీడియోలను ఎడిట్ చేసినట్లు తెలడం… పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాత్రికేయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌పై ఆయా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అంతకుముందు ఏబీఎన్, టీవీ9పై తప్పుడు ప్రచారం చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నేత రాజేశ్ ఫిర్యాదు చేశారు. ఏబీఎన్‌లో ప్రసారం కానీ వీడియోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి.. చానల్స్ క్రెడిబిలిటీని దెబ్బ తీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాని మీదే పోలీసులు విచారణ జరిపి పవన్ మీద ఆరోపణలు వాస్తవమేనని తేల్చారు.