Home సినిమా చిత్ర స‌మీక్ష : భరత్‌ అనే నేను

చిత్ర స‌మీక్ష : భరత్‌ అనే నేను

673
0

– పోకిరీతో ప్రారంభ‌మై భ‌ర‌త్ అనే నేనులో శృతిమించిన‌ వైనం
– ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన భ‌ర‌త్‌

“కాఫీలు తాగారా?.. డ్రింక్స్ తీసుకున్నారా?.. “ అంటూ విలేక‌ర్ల నుద్దేశించి ప్రెస్‌మీట్‌లో డైలాగ్స్ విలేక‌రి వృత్తిని ప‌లుచ‌న చేశాయి. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను చిత్రంలో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో మ‌హేష్ చేసిన వ్యాఖ్య‌లు, డైలాగులు ప్రేక్ష‌క ఆద‌ర‌ణ పొదిన‌ప్ప‌టికీ జ‌ర్న‌లిజం వృత్తిని మ‌రింత ప‌లుచ‌న చేశాయి. సాధార‌ణంగా పోలీస్‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాస్తే పాఠ‌కాద‌ర‌ణ పొందే ప‌రిస్థితి నుండి జ‌ర్న‌లిజంపై విమ‌ర్శ‌లు చేస్తే ఆస‌క్తి క‌లిగించే స్థితికి ప్రేక్ష‌కుల మ‌న‌స్థ‌త్వం మారిందంటే పాత్రికేయ వృత్తిలో నైతిక‌త ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. రాజ‌కీయాంశాల‌తోపాటు ఇత‌ర అంశాలు వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా చూప‌బ‌ట్టే ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింద‌న‌డంలో ఎంలాంటి సందేహం లేదు.

నటీనటులు : మహేష్‌బాబు, కైరా అడ్వాణీ, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌, రమాప్రభ, దేవరాజ్‌, ఆమని, సితార, పోసాని కృష్ణమురళి, రవిశంకర్‌, జీవా, యశ్‌పాల్‌ శర్మ, రావు రమేష్‌, అజయ్‌, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం : రవి కె. చంద్రన్‌, తిరు, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, కళ: సురేష్‌ సెల్వరాజన్‌, సాహిత్యం: రామ జోగయ్యశాస్త్రి
నిర్మాత: డీవీవీ దానయ్య, దర్శకత్వం: కొరటాల శివ, సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ:20-04-2018

‘మహేష్‌ అరుదైన రకం. ఆయనను అలాగే ఉండనిద్దాం.’ అంటూ భ‌ర‌త్ అనే నేను చిత్రం ప్రీరిలీజ్ వేడుక‌ల్లో ఎన్‌టిఆర్ ఒక్క‌మాట‌లో చెప్పాశారు. మ‌హేష్‌ సినిమాలను చూస్తే అది నిజమేననిపిస్తుందన్నారు. అభిమానులను అలరించేందుకు మ‌హేష్‌ చేసిన ప్రయోగాలు తెలుగులో మరో కథానాయకుడు చేయలేదంటే అతిశయోక్తికాదన్నారు. అయితే ‘ఇక ప్రయోగాల జోలికి వెళ్లను. అలా చేస్తే నాన్నగారి అభిమానులు ఇంటికి వచ్చి కొట్టేలా ఉన్నారు’ అని మహేష్‌ సరదాగా చెప్పినప్ప‌టికీ ‘భరత్‌ అనే నేను’ను ఉద్దేశించి నిజమే చెప్పారని అనిపిస్తోందని ఎన్‌టిఆర్ అన్నారు. ఎందుకంటే ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ – కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం `భ‌ర‌త్ అనే నేను` కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, ఆ సినిమా తర్వాత మహేష్‌ నుంచి అభిమానులు ఆశించిన స్థాయిలో మ‌రో సినిమా రాలేదు. మరి ఇప్పుడు విడుదలైన ‘భరత్‌ అనే నేను’ ఆ అంచనాలను అందుకుందా? మహేష్‌ కెరీర్‌లో మరో ‘శ్రీమంతుడు’ అయిందా? ముఖ్యమంత్రిగా మహేష్‌ ఏ మేరకు అలరించారు? అభిమానులకు ఇచ్చిన హామీని ‘భరత్‌..’ నెరవేర్చాడా? అనేదే సినిమా సారాంశం.

కథేంటంటే: భరత్ రామ్ (మహేష్‌బాబు) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (శరత్‌ కుమార్‌) తనయుడు. లండన్‌ కేంబ్రిడ్జ్‌లో చదువుతుంటాడు. తన తండ్రి హఠాన్మరణంతో లండన్‌ నుంచి తిరిగి ఇంటికి వస్తాడు. పార్టీ వాళ్లు అంతా కలిసి భరత్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. భరత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత భుజాన వేసుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన అవాంతరాలేంటి? తనకి ఎదురైన రాజకీయ కుట్రలను ఎలా ఎదుర్కొన్నాడు? వసుమతి (కైరా అడ్వాణీ)తో ప్రేమ కథ ఎలా మొదలైంది? చివరకు భరత్‌ తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేదే కథ మొత్తం.

ఎలా ఉంది : ఇదొక పొలిటికల్ చిత్రం. దానికి మహేష్‌బాబు ఇమేజ్‌కి తగ్గట్టు కమర్షియల్‌ సన్నివేశాలు పొందుప‌ర్చారు. పొలిటికల్‌ డ్రామా అనేసరికి సందేశాలు ఉంటాయి. ఊకదంపుడు ఉపన్యాసాలు రాజకీయ నాయకుల మీద విమర్శలు ఉంటాయనుకుంటాం. అయితే వాటిని బలవంతంగా చొప్పించకుండా రాజకీయ నేపథ్యం అంటే అంతా క్లాస్‌ టచ్‌ ఉంటుందనుకున్నా కూడా పొరపాటే. మాస్‌తో పాటు అన్ని వర్గాలు మెచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. భరత్‌ ముఖ్యమంత్రి అయ్యాక కథలో వేగం ఒక్కసారిగా పెరుగుతుంది. సీఎంగా అతను తీసుకునే నిర్ణయాలు షాకింగ్‌గా అనిపిస్తాయి. వసుమతితో ప్రేమ కథ ప్రేక్ష‌కులు, అభిమానుల‌కు కావాల్సినంత వినోదాన్ని పంచింది. భరత్‌ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సన్నివేశాలు నవ్వులు కురిపించాయి. అలా అక్కడక్కడా వినోదాన్ని తనదైన శైలిలో ద‌ర్శ‌కుడు మేళవించాడు. ‘భరత్‌ అనే నేను’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ వాడుకోవడం ఆక‌ట్టుకుంది. విశ్రాంతి దగ్గరా పెద్ద మలుపులు ఏమీ లేవు.

విశ్రాంతి త‌ర్వాత‌ పూర్తిగా మాస్‌కు నచ్చేలా తీర్చిదిద్దారు. ‘రాచకోత’ నేపథ్యంలో సాగిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ మహేష్‌ అభిమానులకు, యాక్షన్‌ ప్రియులను మెప్పించింది. అక్కడి నుండి కథ వేగమే మారిపోయింది. పాటలను, ఫైట్స్‌, మాస్‌ ఎలిమెంట్స్‌, రాజకీయాల్ని, చక్కగా బ్యాలెన్స్‌ చేస్తూ సెకెండాఫ్‌ సాగిపోతుంది. ప్రెస్‌మీట్‌ ఎపిసోడ్‌ మొత్తం క్లాప్స్‌ కొట్టిస్తుంది. దర్శకుడు చెప్పాలనుకున్న భావాలను మహేష్‌ మాటల్లో చెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ సన్నివేశంలో సంభాషణలు ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను అద్దం పడతాయి. మీడియాను సైతం కార్నర్‌ చేస్తూ చెప్పిన‌ డైలాగ్‌లు ఆలోచింపజేశాయి. పాటలను చక్కగా వాడుకున్నాడు. అవెక్కడా అడ్డుతగలలేదు. పతాక సన్నివేశాలకు ముందు ‘భరత్‌’ జోరు కాస్త తగ్గుతుంది. కానీ, ఇలాంటి కథలకు ఉండే ఇబ్బందే అది. మొత్తంగా చూస్తే ‘భరత్‌ అనే నేను’ పక్కా వాణిజ్యాంశాలతో మేళవించిన రాజకీయ చిత్రంగా మిగిలిపోతుంది.

ఎవరెలా మెప్పించారంటే : ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ న‌ట‌న‌ అత్యుత్తమంగా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఆయన నటించిన ఉత్తమ చిత్రాల జాబితాలో ‘భరత్‌’ ఉంటుంది. ఆయన స్టైలింగ్‌, లుక్స్‌ అన్నీ అభిమానులకు బాగా న‌చ్చాయి. సంభాషణలు పలికే విధానంలో మహేష్‌ కొత్తగా అనిపిస్తాడు. అక్కడక్కడా ఆయన తండ్రి ‘సూపర్‌స్టార్‌’ కృష్ణని గుర్తుకు తెస్తాడు. ఎమోషనల్‌ సన్నివేశాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచేటప్పుడు మరోసారి తనదైన మార్కు వేశాడు. క‌థానాయిక‌ కైరా అడ్వాణీకి ఇది తొలి తెలుగు చిత్రం. మహేష్‌ పక్కన చాలా అందంగా కనిపించింది. ఈ మధ్య కాలంలో మహేష్‌ పక్కన చక్కగా కుదిరిన జంటల్లో కైరా పేరు కూడా ఉంటుంది. బ్రహ్మాజీ ఉన్నది కాసేపైనా నవ్వులు పండించాడు. ప్రకాష్‌రాజ్‌ మరోసారి తనకు అలవాటైన పాత్రలో అల్లుకుపోయాడు. కథకు అవసరమైన మేరకు న‌టీన‌టులు అంద‌రూ మెప్పించారు.

టెక్నిక‌ల్ అంశాలు : సినిమా అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘భరత్‌ అనే నేను’, ‘వచ్చాడయ్యో సామి’ పాటలను సరైన టైమింగ్‌లో వాడారు. రెండూ హీరోయిజాన్ని అత్యున్నత స్థాయిలో చూపించే పాటలే. ‘వసుమతి’ పాటలో సాహిత్యం అర్థవంతంగా ఉంటుంది. మూడు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మరీ హింస, రక్తపాతం జోలికి వెళ్లకుండా క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాడు. రవి కె.చంద్రన్‌ కెమెరా పనితనం, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, సెల్వరాజన్‌ ఆర్ట్‌ సినిమాకు అదనపు మెరుగులు దిద్దాయి. ఇటీవ‌ల‌ కాలంలో వచ్చిన ఖరీదైన చిత్రం ఇదే కావచ్చు. కొరటాల శివ మరోసారి కథకుడిగా, దర్శకుడిగా రాణించాడు. తనెప్పుడూ ఒక మంచి పాయింట్‌ను కమర్షియల్‌ హంగులు జోడించి చెబుతుంటాడు. ఈసారి అదే పంథాంలో వెళ్లి విజయవంతమయ్యాడు.
చిత్రానికి మహేష్‌బాబు పాత్ర చిత్రణ, నటన, కథాంశం, వాణిజ్య విలువలు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, సంగీతం క‌లిసొచ్చాయి. క్లైమాక్స్‌లో మ‌హేష్‌వేగం తగ్గ‌డం కొద్దిగా ఇబ్బంది అనిపించింది.

నోట్ : చిత్ర స‌మీక్ష అడ్మిన్ వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే