Home ఆంధ్రప్రదేశ్ బంద్ విజ‌య‌వంతం – పోరాటం ఇంత‌టితో ఆగిపోదు : జగన్

బంద్ విజ‌య‌వంతం – పోరాటం ఇంత‌టితో ఆగిపోదు : జగన్

485
0

– బంద్ నిర్వీర్యానికి బాబు చేయ‌ని కుట్ర‌లు లేవు.
– పోలీసుల‌తో బంద్‌పై ఉక్కుపాదం మోపారు.
– కాకి దుర్గారావు మృతికి బాబే కార‌కుడు.
– బంద్‌లో పాల్గొనని కొన్ని పార్టీలపై ఆరోపణలు
– అది వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నానన్న జగన్
– సీనియ‌ర్ నేత‌లు, సామాన్యుల‌తో పోలీసుల ప్ర‌వ‌ర్తన ఇదా?
– హోదా ఏపీకి జీన్మ‌ర‌ణ స‌మ‌స్య అన్న వైయ‌స్ జ‌గ‌న్

అమరావతి : “ప్ర‌త్యేక హోదా కావాల‌ని రాష్ట్ర ప్ర‌జలంతా ఆకాంక్షిస్తున్నారు. స్వ‌చ్ఛందంగా బంద్‌లో పాల్గొనేందుకు ప్రజలు ముందుకొచ్చారు. కానీ ద‌గ్గ‌రుండి అతి కిరాత‌కంగా, అతి దారుణంగా ప్ర‌త్యేక హోదాకు వ్య‌తిరేకంగా బంద్ విఫ‌లం చేయ‌టానికి చంద్ర‌బాబు చేయ‌ని కుట్ర‌లు లేవు.” అంటూ వైసిపి అధినేత వైఎస్ జగన్ విలేకరుల సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై స్పందించారు.

మంగళవారం జ‌రిగిన బంద్ చూస్తే మొట్ట‌మొద‌టిగా ఇన్ని కుట్ర‌ల మ‌ధ్య‌, దారుణ‌మైన అణ‌చివేత మ‌ధ్య బంద్ విజ‌య‌వంతం అయిందన్నారు. బంద్‌లో పాల్గొని ప్ర‌త్యేక హోదా మా హ‌క్కు అని చాటినందుకు అన్ని సంఘాలకు, మేథావుల‌కు, దుకాణాల య‌జమానుల‌కు, స్కూల్స్ యాజ‌మాన్యాలకు, విద్యార్థుల‌కు అంద‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శ్రీ‌కాకుళం జిల్లాలో 300 మందికి పైగా అరెస్ట్‌ అయ్యారన్నారు. జిల్లాలో త‌మ్మినేని సీతారాం నుంచి ముఖ్య‌మైన నాయ‌కులు అంద‌రినీ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

విజ‌య‌న‌గరంలో 300 మందికి పైగా అరెస్ట్ చేశారన్నారు. స్వ‌చ్ఛందంగా దుకాణాలు మూసేశారు. విశాఖ‌లో బొత్స స‌త్య‌నారాయ‌ణను అరెస్ట్ చేశారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో వాణిజ్య‌, విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ధ‌ర్నాలు, రాస్తారోకోలు జ‌రిగాయి. పోలీసులు నేత‌ల‌ను అరెస్ట్ చేశారు. నేత‌ల్ని అదుపులోకి తీసుకొని బ‌స్సుల్ని న‌డిపించేందుకు ప్ర‌య‌త్నించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల‌నానిని ఏలూరులో అరెస్ట్ చేశారు. బుట్టాయ‌గూడెంతో కాకి దుర్గారావు అనే సోద‌రుడు గుండెపోటుతో మ‌ర‌ణించారు. జిల్లాలో 300 పైగా కార్యకర్తలు, నాయకులను అరెస్ట్‌ చేశారు.

ప్ర‌కాశం జిల్లాలో 144 సెక్ష‌న్‌తో పోలీస్ 30 యాక్ట్ పెట్టి మ‌రీ పార్టీ నేత‌ల‌ను అరెస్ట్ చేశారు. బాలినేని వాసు, సంతనూతలపాడు ఇంచార్జ్ సుధాకర్, మాజీమంత్రి మ‌హీధ‌ర్ రెడ్డి, గరటయ్య, సాయికల్పనరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 600 మందిని అరెస్ట్‌ చేశారు. అయినా దుకాణాలు స్వ‌చ్ఛందంగా మూసేసి ప్రజలే బంద్ విజ‌యవంతం చేశారు.

నెల్లూరులో కాకాణి, అనిల్‌ వంటి పార్టీ నేత‌ల్ని అంద‌ర్నీ అరెస్ట్ చేశారు. క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల‌లో డీఎస్పీ మ‌హిళ‌ల ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌హిళా పోలీసులు లేకుండా ఎత్తేయ‌టంతో వారికి గాయాలు అయ్యాయి. వైయ‌స్సార్ జిల్లాలో ఎక్క‌బ‌డితే అక్క‌డ అరెస్ట్ చేశారు. ఆకే అమ‌ర్నాథ్ ద‌గ్గ‌ర నుంచి నేత‌లు అంద‌ర్నీ అరెస్ట్ చేశారు. అనంత‌పురం జిల్లాలో వెంక‌ట్రామ‌రెడ్డిని అరెస్ట్ చేశారు. తోపులాట జరిగింది. వెయ్యిమందికి పైగా అరెస్ట్‌ చేశారు. విద్యాసంస్థ‌లు బంద్ పాటించాయి. చిత్తూరులో సీనియ‌ర్ నాయ‌కులతోపాటు 1200మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కుప్పంలోనూ వాణిజ్య సంస్థ‌లు మూతప‌డ్డాయి. కృష్ణాలో పార్థ‌సార‌ధి, మ‌ల్లాది విఘ్ణ‌, రాధాతో పాటు 600 పైగా అరెస్ట్‌ చేశారు. గుంటూరులో సీనియ‌ర్ నాయ‌కులతోపాటు 1100 మందీని అరెస్ట్‌ చేశారు.

చంద్ర‌బాబే ముందుకు వ‌చ్చి మీ ఎంపీల చేత రాజీనామాలు చేయించి దేశ‌మంతా మ‌న‌వైపు చూసేట్టు చేయాలని జగన్ కోరారు. బాబే బంద్‌లో పాల్గొనాల్సిన సంద‌ర్భంలో నిర్వీర్యం చేయ‌టానికి ప్ర‌య‌త్నించారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంలో ప్ర‌త్యేక హోదా ఇవ్వండ‌ని డిమాండ్ చేస్తే.. మీ వ‌ల్లే (బాబు) ఇవ్వ‌కుండా ఉన్నామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిందన్నారు. చంద్ర‌బాబు అడ‌గ‌టం వ‌ల్లే హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తున్నామ‌ని ప్రధాని మోడీ చెబితే నిర‌స‌న తెల‌పాల్సిపోయి.. ప్ర‌త్యేక హోదాకు అడ్డుత‌గిలిన బీజేపీకి, హోదాకు అడ్డుత‌గిలిన మీ మీద బంద్ కాల్‌కు పిలుపు ఇస్తే.. చంద్ర‌బాబు చేసిన నిర్వాకం ఇదని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.

“వెస్ట్ గోదావ‌రిలో దుర్గారావు గుండె పోటుతో చ‌నిపోయారు. కార‌ణం చంద్ర‌బాబు కాదా? హోదా కావాల‌ని ఓ స్వ‌రం గ‌ట్టిగా అడిగితే.. అత‌నికి గుండెపోటు వ‌చ్చేట్లు చేసింది చంద్ర‌బాబు కాదా? మ‌హిళ‌ల‌నీ చూడ‌లేదు. కాల‌ర్ ప‌ట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. మ‌హిళ‌ల‌ను మ‌గ పోలీసుల‌తో నిర్భందం చేశారు. విద్యార్థుల‌ను ఈడ్చుకుంటూ పోతున్నారు.” అంటూ బంద్ లో జరిగిన సన్నివేశాలు వివరించారు.

సీనియ‌ర్ నేత‌ల‌తో ప్ర‌వ‌ర్తించే ఇదా?
అనంత వెంక‌ట్రామ‌రెడ్డిని సీనియ‌ర్ నేత‌. 5, 6 సార్లు ఎంపీగా చేశారు. ఆయ‌న‌తో ప్ర‌వ‌ర్తించిన తీరును జ‌గ‌న్ ఫొటోలు చూపి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒంగోలులో బాలినేని వాసు మాజీ మంత్రితో ప్ర‌వ‌ర్తించిన తీరు, త‌మ్మినేని సీతారాం మాజీ మంత్రితో పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరును ఫొటోలు చూపించారు. చంద్ర‌బాబుకు బుద్ది వ‌చ్చేలా ప్ర‌జ‌లు చేస్తారు అని అన్నారు. ఆయ‌న చెబుతున్న అబ‌ద్ధాలు, చేస్తున్న మోసాలు తారాస్థాయికి చేరే పరిస్థితి వచ్చిందన్నారు. శిశుపాలుడుకు కూడా త‌ప్పు చేస్తే శిక్ష ప‌డ్డ‌ట్లు.. బాబు కూడా 100 త‌ప్పుల‌కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేశాడని ఎద్దేవాచేశారు. దేవుడు మెట్టికాయ‌లు వేస్తాడు, ప్ర‌జ‌లు శిక్ష వేస్తారు అన్నారు.

ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌టానికి చంద్ర‌బాబు చేయాల్సిన ప‌నులు చేయాల్సిన స‌మ‌యంలో చేయ‌క‌పోవ‌టం వ‌ల్ల రాలేదు అనేది వాస్త‌వమన్నారు. హోదా పోరాటం ఇంత‌టితో ఆగిపోదన్నారు. హోదా వ‌చ్చే వ‌ర‌కు ఒత్తిడి కొన‌సాగిస్తామన్నారు. బాబుకు సిగ్గు, శ‌రం ఉన్నా హోదా కోసం చిత్త‌శుద్ధితో ముందుకు రావాలని కోరారు. భావిత‌రాలు చంద్ర‌బాబును చరిత్ర హీనుడుగా చూస్తాడ‌న్న విష‌యం మ‌ర్చిపోవ‌ద్దని హితవు చెప్పారు.