లక్నో : అక్కడి పాలకులు ఎవ్వరో కాదు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను పుణికి పుచ్చుకున్నామని చెప్పుకుంటున్న మోడీ వారసులు. మహిళలను తల్లితో సమానంగా చూడాలని చెప్పుకునే సంస్కృతి తామే వారసులమని జబ్బసరిచే బిజెపి నేతల పాలనలో జరుగుతున్న అకృత్యాలు చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురికాకతప్పదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాద్ పాలనలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందనడానికి ఇదో ఘటన మాత్రమే. తాజాగా ఉత్తర ప్రదేశ్ ఝాన్సీలో తాజాగా ఓ కీచక పర్వం వెలుగు చూసింది. పొలంలో పనిచేస్తున్న తన తల్లికి భోజనం తీసుకు వెళ్తున్న ఓ 16 ఏళ్ల బాలిక పట్ల కొందరు యువకులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా వాళ్లు చేసిన అఘాయిత్యాన్ని సెల్‌ఫోన్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో జూలై 12 న జరిగిన ఈ ఘటన.. వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలస్యంగా ఘటన వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లికి భోజనం ఇచ్చేందుకు బాలిక తన స్నేహితుడైన ఓ అబ్బాయి సాయం కోరింది. ఇద్దరు అటవీ ప్రాంతం గుండా నడుచుకుంటూ వెళ్తుండగా.. కొందరు యువకులు వారిని అడ్డగించారు. బాలికను అటవి లోపలికి లాక్కెళ్లారు.. ఈ సమయంలో అందులోని ఒకరు వీడియో తీశారు. 6 నిమిషాలున్న ఈ వీడియోలో ఆ బాలిక లంచ్ బాక్స్, స్పూన్, బాటిల్ పట్టుకుని ఉండగా.. ఆమె చేతిని ఒకరు పట్టుకుని లాగుతూ తీసుకెళ్తున్నారు. భయంతో ఆ బాలిక తనని ఏం చేయవద్దని వేడుకుంటోంది. కొద్ది దూరం వెళ్లాక ఆమె కూర్చోని ఉండగా.. చుట్టూ చేరిన ఐదుగురు యువకులు ఆ అబ్బాయితో జంగల్‌లో ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తూ వేధించ సాగారు. ఆమె మాత్రం ఆ అబ్బాయి తన స్నేహితుడని, తనకు సాయంగా వచ్చాడని తెలిపింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం స్పష్టత లేదు. ఆ బాలికపై అత్యాచారయత్నం ఏమైన చేశారా అనేది తెలియరాలేదు.
కేసు నమోదు చేసిన పోలీసులు అమ్మాయి వాంగ్మూలం తీసుకొని ఆమెను వైద్య పరీక్షలకు పంపించారు. ఆ అబ్బాయి, బాలిక ఒకే ఊరుకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన ముగ్గురు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.