అమరావతి : చంద్రబాబు కోడలు బ్రాహ్మణి రాజకీయ ప్రవేశం చర్చినియాంశమైనది. నందమూరి బిడ్డగా… నారావారి కోడలుగా బ్రహ్మణి తనేమిటో నిరూపించుకున్నారు. వ్యాపార రంగంలో సత్తా చాటి డైనమిక్ మహిళా పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఆమె రాజకీయాల్లోకి వస్తే మరింత బాగుంటుందని చర్చిస్తున్నారు. చంద్రబాబు కుటుంబ వ్యాపారం హెరిటేజ్ బాధ్యతలు చేపట్టిన బ్రహ్మణి అనతి కాలంలోనే సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి టీంలో కీలక పాత్ర పోషించారు. అలా వ్యాపారవేత్తగా బ్రహ్మణి సాధించిన విజయాల నేపథ్యంలో రాజకీయంగా కూడా ఆమె తనేమిటో నిరూపించేకోనున్నారని ప్రచారం జరిగింది. బ్రహ్మణి వంటి మహిళ రాజకీయ అరంగేట్రం చేస్తే టీడీపీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ శ్రేణులు కూడా ఆశపడ్డాయి. ఆ క్రమంలోనే అక్కడక్కడా బ్రహ్మణి రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్లు వినిపించాయి. బ్రహ్మణి రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారానికి టీడీపీ నేతల మాటలు .. ఆకాంక్షలు తోడు కావడంతో బ్రహ్మణి రాజకీయ ప్రవేశం ఆసక్తికర అంశంగా మారింది. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరు ఏపీ రాజకీయాలకు పరిమితం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా కొన్ని డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. చంద్రబాబు కుటుంబం నుంచి ఎవరో ఒకరు తెలంగాణలో పార్టీకి నాయకత్వం వహిస్తే బావుంటుందని అక్కడి నేతలు పదేపదే కోరుతున్నారు.
ఆ ఎవరో ఒకరు బ్రహ్మణి అయితే yబావుంటుందన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ భేటీలో బ్రహ్మణి రాజకీయాల్లోకి రావాలని, తెలంగాణలో టీడీపీ బాధ్యతలు తీసుకోవాలని సీఎంను తెలంగాణ నేతలు కోరారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. హైద్రాబాద్ లో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడి ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత మాట్లాడుతూ నారా బ్రహ్మణి రాజకీయ ప్రవేశంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బ్రహ్మణికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. తెలంగాణ నేతల కోరికను తోసిపుచ్చారు. ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పారు.
దాంతో తెలుగుదేశం శ్రేణులు కొంత నిరుత్సాహానికి గురయ్యాయి. పైగా తెలంగాణలో పార్టీ స్వతంత్రంగా ఎదగాలని అందుకు వసరం అయిన సహకారం ఇస్తానని చంద్రబాబు. తేల్చి చెప్పారు. పైగా టీడీపీ ముఖ్య నేతలపై ఒకింత అసంతృప్తిని కూడా చంద్రబాబు వ్యక్తం చేశారు. ఎవరో వస్తారని ఎదురు చూడవద్దని మీ కాళ్లపై మీరు నిలబడాలన్నదే తన ద్యేయమని తేల్చి చెప్పారని సమాచారం. ఆ క్రమంలోనే మెతకగా వుండొద్దని ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణకు కూడా హితబోధ చేశారు.
కాగా, నారావారి కోడలుగానే కాకుండా హెరిటేజ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా బ్రహ్మణి బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పారిశ్రావేత్తల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హెరిటేజ్ తరుపున బ్రహ్మణి వెళ్లారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. ఆమె అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటోందన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన ప్రకటనతో ఇకపై బ్రహ్మణి ఎప్పటిలానే వ్యాపారానికి ఇతర సామాజిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కానున్నారు.