Home ఆంధ్రప్రదేశ్ తప్పు చేస్తే… ఆశలు వదులుకోవాల్సిందే… చంద్రబాబు సంచలన కామెంట్స్…!

తప్పు చేస్తే… ఆశలు వదులుకోవాల్సిందే… చంద్రబాబు సంచలన కామెంట్స్…!

402
0

అమరావతి : తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాలసిందే… చిన్న పిల్లలపై ఘాతుకానికి పాల్పడితే ప్రాణాలపై ఆశలోదులుకోవాలసిందే… ఇలాంటి ఘటనలు నీనెప్పటికి క్షమించను… ప్రభుత్వం స్పందించిన తీరుకు భయపడి నిందితుడు తనకు తానే ఉరి శిక్ష విధించుకున్నాడు. ప్రతిపక్ష పార్టీ ఇలాంటి అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటే ప్రజలు క్షమించరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్ద స్వరంతో ఉగ్రరూపం దాల్చారు. దాచేపల్లి ఘటనపై ఆవేదనతో జీరాబోయింది గొంతుతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీచులకు ఈ గడ్డపై తావు లేదు. ఎవ్వరైనా పద్ధతిగా ఉండాల్సిందే. ఆంబోతుల్లా రోడ్లమీదికి వస్తామంటే కుదరదు. అలాంటి వారిని దేవుడు కూడా రక్షించలేడు. భూమిమీద అదే వారికి ఆఖరి రోజు అవుతుంది’’ అని చంద్రబాబు నిప్పులుగక్కారు. ‘‘జీవితం మీద ఆశలు వదులుకుంటేనే ఆడ పిల్లల జోలికి వెళ్ళాలి. ఈ గడ్డపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి అదే ఆఖరి రోజు అవుతుంది. ఇప్పటిదాకా నాలో మంచినే చూశారు. ఇక కాఠిన్యాన్నీ చూస్తారు. ఆడపిల్లల జోలికి వచ్చే వారిని వదిలేది లేదు’’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

అత్యాచార ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించడం… నిందితుడు రామసుబ్బయ్యకోసం 17 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడం తెలిసిందే! అయితే… రామసుబ్బయ్య తనకు తానుగా ఉరి ‘శిక్ష’ విధించుకున్నాడు. ఈ నేపథ్యంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం రాత్రి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. వారిని చంద్రబాబు ఓదార్చి, భరోసా ఇచ్చారు. ‘‘ఎవరి దగ్గరైనా ఆటలు సాగుతాయోమో కానీ నాదగ్గర సాగవు. ఈ ఘటన జరిగిన వెంటనే 17 పోలీసు బృందాలను నియమించాం. 48 గంటల్లోనే పరిష్కరించాం. నేరస్తుడు తప్పించుకోలేని పరిస్థితి కల్పించాం’’ అని చంద్రబా బు వివరించారు. దాచేపల్లి ఘటనను రాజకీయం చేస్తోందంటూ విపక్ష వైసీపీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

‘తప్పుడు రాజకీయాలు చేసే పార్టీలూ ఖబడ్దార్‌’ అని హెచ్చరించారు. ‘వైసీపీ తప్పుడు పనులకు, నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు వైసీపీతో సంబంధాలున్నాయి. కానీ, వైసీపీ నేతలు మాత్రం దొంగే దొంగ అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. కఠువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనల నేపథ్యంలో… చిన్న పిల్లలను రేప్‌ చేసిన వారికి ఉరిశిక్ష విధించేలా తెచ్చిన ఆర్డినెన్స్‌ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడున్న చట్టాలను మరింత కఠినంగా మారుస్తామన్నారు. అలాగే… మగ పిల్లలు తప్పుదారి పట్టకుండా తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. దాచేపల్లి ఘటనకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో అవగాహన కల్పించేలా, బాలికలు, మహిళలకు భరోసా ఇచ్చేలా ఈ ర్యాలీలు సాగాలని సీఎం అన్నారు. శనివారం తాను గుంటూరుకు వెళ్లి బాధిత బాలికను పరామర్శిస్తానని తెలిపారు. బాలిక కుటుంబానికి రూ.5 లక్షలు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.

శుక్రవారం బాధిత బాలిక కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. జరిగిన సంఘటన గురించి వివరించారు. అలాంటి దుష్టులకు బహిరంగంగా ఉరివేసేలా చట్టాలు తేవాలని కోరారు. తమ కేసులో ప్రభుత్వం స్పందించిన తీరు పై వారు సంతృప్తి వ్యక్తం చేసారు. ఇక నిందితుడు రామసుబ్బయ్యకు భగవంతుడే మరణశిక్ష విధించాడని మైనర్‌ బాలిక సమీప బంధువులు అభిప్రాయపడ్డారు. తమతోపాటు ప్రజలంతా కోరుకున్నట్లుగానే సుబ్బయ్య కథ ముగిసిందని పేర్కొన్నారు. ఇది భగవంతుడు వేసిన శిక్షగా తాము భావిస్తున్నామని చెప్పారు.