డిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. శాసనసభ్యుల కోటా కింద రాజ్యసభ సభ్యులకు ఎన్నిక జరుగనుంది. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన 58 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్- మే నెలలతో ముగియనుంది. ఆయా స్థానాల్లో కొత్తవారి ఎన్నికల నిర్వహణకు మార్చి 5న నోటిఫికేషన్ ప్రకటించనుంది. మార్చి 23న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అలాగే మార్చి 23న సాయంత్రం 5గంటలకు ఓట్లు లెక్కిస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో మూడు స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ కానున్న ఆరు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రస్తుతం చిరంజీవి, దేవేందర్ గౌడ్, రేణుకా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తుండగా తెలంగాణ నుండి సిఎం రమేష్, రాపోలు ఆనంద్‌భాస్కర్, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఇటీవల కన్నుమూయడంతో ఆ స్థానం ఖాళీగానే ఉంది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ గడువు దగ్గరలోనే ఉండటంతో ఆయన స్థానానికి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించలేదు.
రాష్ట్ర విభజన సమయంలో సీట్ల కేటాయింపు కారణంగా దేవేంద్రగౌడ్ తెలంగాణకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికయ్యారు. అలాగే సిఎం రమేష్ ఏపీకి చెందినవారైనప్పటికీ ఆయన తెలంగాణ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఆరు స్థానాల్లోనూ కొత్తగా అభ్యర్థులను నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఏపీలో అధికార టిడిపి రెండు స్థానాలను కైవసం చేసుకోనుంది. మూడో స్థానం వైసిపికి దక్కే అవకాశం ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షం వైసిపి, అధికార టిడిపిల మధ్య మూడో సీటు వ్యవహారంలో మాత్రం ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వైసిపి నుండి 22 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడంతో వైసిపి సంఖ్యాబలం తగ్గింది. అధికార పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గనక తోడైతే ఉన్న మూడో సీటు కూడా తెదేపా కైవసం చేసుకొనే అవకాశం ఉంది. అందువల్ల వైసిపి తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.