కొండేపి : సెప్టెంబరు మొదటి వారంలో బ్యాంకులు 2 రోజులే పనిచేస్తాయనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా ప్రచారంలో ఉన్నాయి. ఇది తప్పుడు సమాచారమని బ్యాంకుల అధికారులు స్పష్టం చేస్తున్నారు. సెప్టెంబరు 1 మొదటి శనివారం సెలవు ఏమీ లేదు. 2న ఆదివారం సెలవే. సెప్టెంబరు 3 (సోమవారం) కృష్ణాష్టమి సెలవని, 4, 5 తేదీల్లో బ్యాంకు సిబ్బంది సమ్మె అయినందున పనిచేయవని ప్రచారం చేస్తున్నారు. కృష్ణాష్టమి సెలవు రాష్ట్రాల వారీగానే ఇస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో సెలవున్నా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఇవ్వలేదు. ఇక మంగళ (4), బుధవారాల్లో (5న) ఆర్‌బీఐ ఉద్యోగుల సామూహిక సెలవు కనుక సెలవనే ప్రచారం అవాస్తవం. దీనికి బ్యాంకులకు సంబంధమే లేదు. యధావిధిగా పనిచేస్తాయని జాతీయ బ్యాంకుల ఉన్నతాధికారులు వెల్లడించారు. గురు-శుక్రవారాలు సెలవేమీ లేదు. మళ్లీ రెండో శనివారం (సెప్టెంబరు 8) సెలవే. ఖాతాదారులు ఇందుకనుగుణంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.