నల్గొండ : నల్గొండలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ(61) తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని కామినేని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి నెల్లూరులోని వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆయనతోపాటు నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు ఎడమవైపు నుంచి కుడివైపునకు పల్టీ కొట్టింది. ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని రాసుకుంటూ కొంతదూరం వెళ్లింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఆయనను కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయటనించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలను నిలపలేకపోయారు. ప్రమాదం తెలుసుకున్న హరికృష్ణ తనయులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ హుటాహుటిన కామినేని ఆస్పత్రికి బయలుదేరారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరారు.
సినిమా రంగంలో….
నందమూరి తారకరామారావు, బసవతారకం నాలుగో సంతానంగా హరికృష్ణ. 1956 సెప్టెంబరు 2న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. చిన్నతనంలో 1967లో ‘శ్రీ కృష్ణావతారం’ సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘తల్లా పెళ్లామా’, ‘రామ్ రహీమ్’, ‘దాన వీర శూర కర్ణ’ వంటి చిత్రాల్లో అలరించారు. ఆ తర్వాత సినిమాల నుండి కొంత కాలం విరామం తీసుకున్నారు. తిరిగి 1998లో ‘శ్రీరాములయ్య’తో మరోసారి వెండితెరపైకి వెలిగారు. ఆ తర్వాత ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘శివరామరాజు’, ‘సీతయ్య’, ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’, ‘స్వామి’, ‘శ్రావణమాసం’ చిత్రాల్లో నటించి ప్రేక్షకాభిమానం పొందారు.
రాజకీయాల్లో ఎన్టీఆర్ చైతన్య రాధ సారధిగా…
నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) రాజకీయాల్లోకి వచ్చాక.. హరికృష్ణ ఆయన వెంటే ఉన్నారు. ఎన్టీఆర్ ప్రచార వాహనమైన చైతన్య రథాన్ని హరికృష్ణ నడిపించారు. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్లాక.. ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. 1999ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను పోటీలో నిలిపినప్పటికి పెద్ద ప్రభావం చూపలేకపోయారు. అప్పటి ఎన్నికల్లో ఆయన మాత్రం గెలిచారు. మళ్లీ తెలుగుదేశంలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అయితే కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా 2014 జనవరిలో నల్గొండ జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు.