Home జాతీయం చంద్రబాబు తరహాలో రైతు రుణమాఫీతో మోడీకి కుమారస్వామి షాక్

చంద్రబాబు తరహాలో రైతు రుణమాఫీతో మోడీకి కుమారస్వామి షాక్

469
0

బెంగుళూరు : దక్షిణాదిలో కమలం జెండా రెపరేపలాడించాలని ప్రధాని మోడీ కన్న కలలు కల్లలైనట్లే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో ఎదురయ్యే నష్టాన్ని దక్షిణాదిలో పూడ్చుకోవాలని మోడీ-షా ద్వయం ఎన్నో ప్రణాళికలు రచిస్తోంది. అందుకు మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేపట్టాలని అన్ని రకాల అడ్డ దారులు తొక్కారు. కానీ సఫలం కాలేకపోయారు. అయితే వచ్చే లోక్ సభ ఎన్నికలకైనా పుంజుకుని ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ నేతలు కలలుగంటున్నారు. ఎందుకంటే బీజేపీకి దక్షిణాదిలో కొద్దోగొప్పే ఆశ ఉన్నది కర్ణాటకలోనే. కానీ ఇప్పుడు అక్కడా ఛాన్స్ లేకుండా ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలి బడ్జెట్ పెట్టిన కుమారస్వామి సంచలన నిర్ణయం ప్రకటించారు. రూ.34 వేల కోట్ల విలువైన రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించి బీజేపీ నేతలు గుడ్లు తేలేసేలా చేసారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇచ్చిన డైరెక్షనే కారణమని ప్రకటించిన కుమారస్వామి రైతు రుణాల మాఫీ విషయంలోనూ ఆంధ్రా సీఎం చంద్రబాబునే ఆదర్శంగా తీసుకున్నారు.

కేంద్రం సహకరించకున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఆంధ్రాలో చంద్రబాబు రైతు రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కుమారస్వామి కూడా తాను కాంగ్రెస్ మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతున్నా బీజేపీకి ఝలక్ ఇవ్వడంలో మాత్రం దిగ్విజయం సాధించారు. గురువారం విధానసౌధలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా రూ.34వేల కోట్ల రుణాలను మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. తొలి దశలో భాగంగా గత సంవత్సరం డిసెంబర్ 31లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు.

అంతేకాదు, తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన రైతులకు కూడా కుమారస్వామి నజరానా ప్రకటించారు. రుణాలు సకాలంలో చెల్లించిన రైతుల అకౌంట్లో రూ.25వేలు క్రెడిట్ చేస్తామని శుభవార్త చెప్పారు. రూ.2లక్షల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని కుమారస్వామి ప్రకటించారు. కొందరు రైతులు రూ.40లక్షల వరకు రుణాలు తీసుకున్నారని.. అంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయడం సరైంది కాదనే ఉద్దేశంతోనే రూ.2లక్షల లోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. అయితే ప్రభుత్వ యంత్రాంగంలోని కుటుంబాలకు, సహకార రంగంలో ఎవరైతే సొంత భూములు కలిగి ఉన్నారో వారికి రుణ మాఫీ వర్తించదని స్పష్టం చేశారు.

గత మూడేళ్ల నుంచి ఆదాయపు పన్ను చెల్లించిన రైతులూ రుణ మాఫీకి అనర్హులని ప్రకటించారు. అయితే కుమారస్వామి నిర్ణయాన్ని కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో బాహాటంగానే వ్యతిరేకించారు. కూటమితో ఏర్పడిన ప్రభుత్వం కావడంతో అనేక చర్చల తర్వాత రుణమాఫీపై కుమారస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిద్ధరామయ్య రూ.50వేల వరకూ ఉన్న రైతు రుణాలను మాఫీ చేశారు. ఇదిలా ఉంటే, త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు రైతు రుణ మాఫీ కలిసొస్తుందని కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ఆశలు పెట్టుకుంది. కర్ణాటక రైతాంగం ప్రభుత్వ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసింది.