Home జాతీయం ముంద‌స్తు ఉత్కంఠకు నేడు తెర ప‌డ‌నుందా!

ముంద‌స్తు ఉత్కంఠకు నేడు తెర ప‌డ‌నుందా!

551
0

హైదరాబాద్ : తెలంగాణ‌లో ముందస్తు శాస‌న స‌భ ఎన్నిక‌ల వేడికి రాజుకుంది. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ముందస్తు ఉత్కంఠ‌కు మ‌రికొద్దిసేప‌ట్లో తెర‌ప‌డ‌నుందా? గురువారం మంత్రివర్గం సమావేశం కానుంది. ఏకవాక్య తీర్మానం ద్వారా శాసనసభ రద్దుకు సిఫార్సు చేయాలా? లేక ర‌ద్దు చేయ‌కుండానే ఎన్నిక‌లు కోరాలా? అనే అంశంపై చ‌ర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశ అజెండాలో శాసనసభ రద్దు అంశం మాత్రమే ప్ర‌ధాన‌మైన‌ద‌న్న‌ట్లు తెలిసింది. మ‌ద్యాహ్నం మంత్రి వ‌ర్గం స‌మావేశమ‌య్యే అవ‌కాశం ఉంది. మ‌త్రివ‌ర్గ స‌మావేశం అనంతరం గవర్నర్‌ను క‌లిసి మంత్రివ‌ర్గ నిర్ణ‌యాలు వివ‌రించే అవ‌కాశం ఉంది. శాస‌న స‌భ ర‌ద్దు చేయాల‌నుకుంటే ర‌ద్దు తీర్మాన్నాన్ని అందజేస్తారని తెలుస్తోంది. మంత్రులు అంద‌రూ అందుబాటులోనే ఉన్నారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన అనంత‌రం ముఖ్య‌మంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడుతారు. అదే స‌మావేశంలో దాదాపు 50 మంది వరకు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తారని భావిస్తున్నారు. వివిధ శాఖ‌ల నుండి వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌ను మంత్రివ‌ర్గం కోస‌మే వాయిదా వేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం సాయంత్రం వ్యవసాయక్షేత్రం నుండి ప్రగతిభవన్‌ చేరుకున్నారు. వివిధ శాఖ‌ల‌ అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వప్రధానకార్యదర్శి ఎస్‌కె జోషి, సలహాదారు రాజీవ్‌శర్మ, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, జీఏడీ రాజకీయ కార్యదర్శి అధర్‌సిన్హా, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సమావేశానికి హాజ‌ర‌య్యారు. అసెంబ్లీ రద్దు, ఆ త‌ర్వాత‌ తీసుకోవాల్సిన చర్యలపై వివరంగా చర్చించినట్లు తెలిసింది. ఉద్యోగులు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలను కూడా మాట్లాడారు. బుధ‌వారం సాయంత్రం ముఖ్య‌మంత్రి కెసిఆర్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లుస్తార‌నుకున్న‌ప్ప‌టికీ క‌ల‌వ‌లేదు. సభ రద్దుకు మంత్రివర్గం తీర్మానం చేసిన తర్వాత గవర్నర్‌ను కలవనున్నారు.