Home వైద్యం రిమ్స్ డైరెక్ట‌ర్ తీరుపై సిఎం దృష్టికి : ఎస్‌సి కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ జూపూడి ఆక‌స్మిక త‌నిఖీ

రిమ్స్ డైరెక్ట‌ర్ తీరుపై సిఎం దృష్టికి : ఎస్‌సి కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ జూపూడి ఆక‌స్మిక త‌నిఖీ

398
0

ఒంగోలు : ఎస్‌సి కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ జూపూడి ప్ర‌భాక‌ర‌రావు ఒంగోలు రిమ్స్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఒంగోలు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న తొలుత ఆర్ అండ్ బి అతిధి గృహంలో కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన అనంత‌రం త‌న వాహ‌నాన్ని నేరుగా రిమ్స్‌కు మ‌ళ్లించారు. రిమ్స్ వైద్య‌శాల‌కు వ‌చ్చిన ఆయ‌న కొద్దిసేపు రోగుల వార్డుల్లో ప‌ర్య‌టించారు. రోగుల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. జూపూడి హాస్పిట‌ల్‌కు వ‌చ్చాడ‌ని ఆల‌స్యంగా తెలుసుకున్న డాక్ట‌ర్లు ఆయ‌న వ‌ద్ద‌కు చేరుకున్నారు. వైద్య‌శాల‌లో తాము అందిస్తున్న సేవ‌ల‌ను వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఈలోపే వైద్య‌శాల‌లో తాను గ‌మ‌నించిన అంశాల‌ను డాక్ట‌ర్ల‌తో ప్ర‌శ్నించారు.

రిమ్స్ వైద్య‌శాల‌లో సిటి స్కాన్‌, ఎంఆర్ఐ స్కాన్ వంటివి ఎందుకు ప‌నిచేయ‌డంలేద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేకించి జ‌రుగుమ‌ల్లి మండ‌లంకు చెందిన మెడ‌బ‌లిమి బ్ర‌హ్మ‌య్య అనే రోగి ఆరోగ్య స్థితి, వైద్యం చేసిన వివ‌రాల‌ను కేస్ స్ట‌డీ ప‌రిశీలించారు. ఆయ‌న‌కు వైద్యం చేస్తున్న‌ట్లు చెప్పిన న్యూరో డాక్ట‌ర్‌తో ఫోనులో మాట్లాడారు. ఆ రోగికి సంబంధించిన శ‌స్ర్త‌చికిత్స విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. రిమ్స్‌లో రెగ్యుల‌ర్ న్యూరో స‌ర్జ‌న్ లేనందున బ‌య‌టి నుండి స‌ర్జ‌రీలు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌వేటు డాక్ట‌ర్ల‌ను పిలుస్తున్న‌ట్లు రిమ్స్ డైరెక్ట‌ర్ చెప్పిన స‌మాధానంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాధ్య‌త‌గా ఉండాల్సిన స్థానంలో ఉండి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం పేద‌ల వైద్యం కోసం పెద్ద‌మొత్తంలో ఖ‌ర్చు చేస్తుంద‌ని చెప్పారు. రిమ్స్‌లో జ‌రుగుతున్న వైద్య‌సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. వైద్య‌సేవ‌లందించ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే ఎంత‌టి చ‌ర్య‌లు తీసుకునేందుకైనా వెనుకాడేది లేద‌ని హెచ్చ‌రించారు.