Home ఆంధ్రప్రదేశ్ ఈనెల 24న ఏపీ బంద్‌ : కేంద్రంపై ఒత్తిడికి జగన్

ఈనెల 24న ఏపీ బంద్‌ : కేంద్రంపై ఒత్తిడికి జగన్

598
0

– బంద్‌కు అందరూ సహకరించాలని కోరిన వైయస్‌ జగన్‌
– ప్రజల నిరసన కేంద్రానికి తెలియాలి.
– డిమాండ్‌ను అన్ని పార్టీలూ గుర్తించాలి
– చంద్రబాబుపైనా ఒత్తిడి పెరగాలన్న జననేత
– ఇప్పటికైనా చంద్రబాబు ఎంపీలతో రాజీనామా చేయించాలి

కాకినాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ ఎంత బలంగా ఉందో అన్ని పార్టీలకు తెలియడంతో పాటు, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈనెల 24న రాష్ట్ర బంద్‌ పాటించాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక హోదా సాధన కోసం ఇప్పటికైనా కలిసివచ్చి టీడీపీ ఎంపీలతో వెంటనే రాజీనామా చేయించాలని ఆయన చంద్రబాబును కోరారు. ఆ తర్వాత మొత్తం 25 మంది ఎంపీలతో నిరాహార దీక్ష చేయిద్దామన్నారు. అప్పుడు ఈ అంశం యావత్‌ దేశ దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. దీంతో కేంద్రం దిగి వస్తుందని, ప్రత్యేక హోదా ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరాహార దీక్ష చేపట్టడానికి ఇప్పటికే రాజీనామా చేసిన తమ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం కాకినాడలోని జెఎన్టీయూ శిబిరం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో సుదీర్ఘ చర్చ.. ఆ తర్వాత తీర్మానం వీగిపోవడం తదితర అంశాలపై ఈ సమావేశంలో ఆయస స్పందించారు.

ప్రధాని అన్నీ మర్చిపోయారు….
రాష్ట్రం మీద పెద్దలకు ఉన్న ప్రేమ చూస్తే బాధ అనిపించిందని వైయస్‌ జగన్ అన్నారు. ప్రధాని మోదీ మొదలు బీజేపీ, కాంగ్రెస్‌ వరకు.. ఎవ్వరు కూడా ప్రత్యేక హోదాపై గతంలో ఇచ్చిన హామీ గురించి అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి హోదా ఇస్తామని విభజన సమయంలో నాటి ప్రధాని స్పష్టంగా చెప్పారని తెలిపారు. కానీ అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చలో ప్రధాని మోదీ ఆ విషయాన్ని అస్సలు ప్రస్తావించలేదని అన్నారు. దీనిపై గతంలో తిరుపతిలో ఇచ్చిన హామీ కూడా ప్రధానికి గుర్తు రాలేదన్నారు. చివరకు బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ కూడా ఆయనకు అసలు గుర్తు లేదని ఆక్షేపించారు.

ఆ హక్కు చంద్రబాబుకు ఎక్కడిది?
చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామని ప్రధాని చెప్పడం బాధాకరమని జగన్ పేర్కొన్నారు. అసలు హోదా కాకుండా ప్యాకేజీ చాలని చెప్పడానికి చంద్రబాబు ఎవరు? ఆయనకు ఆ హక్కు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత వలస పోతున్నారని చెప్పారు. అలా దాదాపు 5 లక్షల మంది వలస పోయారన్నారు. నిజానికి హోదా వల్లనే పెట్టుబడులు వస్తాయని, పరిశ్రమలు ఏర్పాటై ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. అయితే దాన్ని వద్దనే హక్కు చంద్రబాబుకు, బీజేపీకి ఎవరిచ్చారు? అని నిలదీశారు.

రాహుల్‌ కూడా పట్టించుకోలేదు…?
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తన ప్రసంగంలో కనీసం అర నిమిషం కూడా రాష్ట్రానికి సంబంధించి మాట్లాడలేదని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ధర్మం అయినా, కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదన్న మాట ఆయన నోట రాకపోవడం బాధాకరమని చెప్పారు.

మా మాటలే జయదేవ్‌ నోట
‘మరోవైపు చంద్రబాబు ప్రవర్తన ఇంకా బాధ కలిగించింది. నిన్న (శుక్రవారం) చంద్రబాబు తరపున ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడారు. ఆయన మాటలు.. గత నాలుగేళ్లుగా మేము చెబుతున్నవే కదా? చంద్రబాబును సూటిగా అడుగుతున్నాను. ప్రత్యేక హోదా గురించి గత నాలుగేళ్లుగా అసెంబ్లీలోనూ, యువభేరీలోనూ.. ఢిల్లీ నుంచి గల్లీ దాక మేము చేసిన ధర్నాలతో పాటు, నిరాహారదీక్షల సందర్భంగా మేము ఏయే అంశాలు చెప్పామో.. వాటినే గల్లా జయదేవ్‌ తన ప్రసంగంలో చెప్పారు’. అని జగన్ అన్నారు.

‘కానీ మేము గతంలో ఆ మాటలన్నప్పుడు మమ్మల్ని అవహేళన చేశారు. హోదా వల్ల ఏం ఒరుగుతుందని ఎద్దేవా చేశారు. అసెంబీ సాక్షిగా చంద్రబాబు కూడా చెప్పారు. హోదా ఉన్న రాష్ట్రాలకు.. లేని రాష్ట్రాలకు తేడా లేదని అన్నారు. ఆ మేరకు అసెంబ్లీలో సభ్యులకు అవగాహన కల్పించేలా ఒక పుస్తకం కూడా ఇచ్చారు. అంతే కాకుండా మహానాడులో కూడా హోదా కంటే ప్యాకేజీ బెస్ట్‌ అని తీర్మానించారు’ అని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఆ 6నెలలు ఏం చేశారు?
2014, మార్చి 2న నాటి కేంద్ర కేబినెట్‌.. రాష్ట్రానికి హోదా ఇవ్వాలని అప్పటి ప్రణాళికా సంఘానికి లేఖ రాసిందని జగన్ గుర్తు చేశారు. అదే ఏడాది జూన్‌లో చంద్రబాబు సీఎం అయ్యారని, అప్పటి ప్లానింగ్‌ కమిషన్‌ ఆ ఏడాది డిసెంబరు 31 వరకు ఉందని చెప్పారు. అయినా ఆ ఆరు నెలలు హోదా విషయాన్ని చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదని ఆరోపించారు.

రాష్ట్రానికి ప్యాకేజీపై 2016 సెప్టెంబరు 7న ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన చేశారని అన్నారు. అప్పుడు టీడీపీ మంత్రులు కూడా ఉన్నారని చెప్పారు. ప్యాకేజీకి చంద్రబాబు కూడా అనుకూలమని జైట్లీ చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత అదే రాత్రి చంద్రబాబు అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారని అన్నారు. 2017, జనవరి 27న విలేకరుల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు, హోదా కంటే ప్యాకేజీనే బెస్ట్‌ అని చెప్పారంటూ ఆరోజు ఈనాడులో ప్రచురితమైన కథనం చూపారు.

చంద్రబాబు కలిసి రాలేదు
‘ఈ ఏడాది ఏప్రిల్‌ 6న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయం యావత్‌ దేశ దృష్టిని ఆకర్షించేలా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. అదే సమయంలో చంద్రబాబు కూడా తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి, నిరాహార దీక్షకు కూర్చోబెట్టి ఉంటే కేంద్రం దిగి వచ్చేది కాదా? విషయం యావత్‌ దేశ దృష్టిని ఆకర్షించేది కాదా? ఇవన్నీ తెలిసినా చంద్రబాబు కలిసి రాలేదు’ అని జగన్ పేర్కొన్నారు.

చంద్రబాబు డ్రామాలు
‘ఇప్పుడు కూడా చంద్రబాబు డ్రామా ఆడుతున్నాడు. ఒకవైపు బీజేపీతో యుద్ధం అంటాడు. అయితే ఆయన నిజంగా బీజేపీతో యుద్ధం చేస్తున్నాడా? అని సామాన్యులకు కూడా అనుమానం వస్తోంది. స్వప్నా ముంగింటివార్‌ను టీటీడీ బోర్డులో నియమించారు. ఆమె మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య. ఆయన గతంలో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పని చేశాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ను బాలకృష్ణ తీస్తుంటే పక్కన వెంకయ్యనాయుడు వచ్చి కూర్చున్నాడు. ఇక ఇక్కడ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్‌ భార్య నిర్మలా సీతారామన్‌ కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నారు’. ‘వీటన్నింటికి మించి నిన్న హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా స్పష్టం చేశారు. చంద్రబాబు ఇప్పటికీ తమ మిత్రుడే అని తేల్చి చెప్పారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసి, ఇప్పుడు విడాకులు తీసుకున్నాడు. బీజేపీతో పోరు అంటూ ఇప్పుడు డ్రామాలు చేస్తున్నాడు’ అని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

చంద్రబాబుకు సూటి ప్రశ్న
రాష్ట్రానికి హోదా కావాలని తాము నాలుగేళ్లుగా పోరాడుతున్నామని, అందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదని జగన్ స్పష్టం చేశారు. అదే చంద్రబాబు ఈ నాలుగేళ్లుగా హోదా విషయంలో మోసం చేశాడని, మళ్లీ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు.

ఇప్పటికైనా కలిసి రండి
‘మీరు అవిశ్వాస తీర్మానం పెట్టగానే చర్చకు అనుమతించారు. కేటాయించిన సమయానికి మించి గంట మాట్లాడినా అనుమతించారు. ఓకే. మీ తీర్మానం వీగి పోయింది. కాబట్టి ఇప్పుడైనా మీ ఎంపీలతో అందరూ రాజీనామా చేయించండి. మా ఎంపీలు ఇప్పటికే రాజీనామా చేశారు. కాబట్టి మీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించండి. ఆ తర్వాత మొత్తం 25 మంది ఎంపీలతో నిరాహారదీక్ష చేయిద్దాము. మా వాళ్లు అందుకు రెడీ. అలా రాష్ట్రానికి చెందిన మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేసి, నిరాహార దీక్ష చేపడితే ఈ విషయం యావత్‌ దేశ దృష్టిని ఆకర్షిస్తుంది. అప్పుడు కేంద్రం దిగి వస్తుంది’ అని తేల్చి చెప్పారు.

24న రాష్ట్ర బంద్‌
చంద్రబాబు ఆ పని చేయడని, అందువల్ల ఆయనపై ఒత్తిడి పెంచడంతో పాటు రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయానికి నిరసనగా మంగళవారం (24వ తేదీ) రాష్ట్ర బంద్‌ చేపడుతున్నట్లు వైయస్‌ జగన్‌ ప్రకటించారు. అప్పుడైనా చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతుందని, హోదాపై ఉన్న డిమాండ్‌ అన్ని పార్టీలకు తెలుస్తుందని స్పష్టం చేశారు. కాబట్టి బంద్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

ఒక్కరైనా హోదా గురించి మాట్లాడారా?
‘తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు పార్టీలకు కృతజ్ఞత చెప్పేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నాడు. ఎందుకు? ఏ ఒక్క పార్టీ అయినా రాష్ట్రానికి హోదా కావాలని చర్చలో కోరిందా? ఎవరికి వారు సొంత ఎజెండాతో మాట్లాడారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడంతో పాటు, జాతీయ మీడియాతో మాట్లాడినంత మాత్రాన ఏం ఒరుగుతుంది? అని ప్రశ్నించారు.
‘హోదా విషయంలో ఏ పార్టీని నమ్మొద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నాడు రాష్ట్ర విభజన వద్దని మేమెంతో వాదించాము. అయినా కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. అడ్డగోలుగా విభజించారు. ఏ ఒక్క అంశాన్ని స్పష్టంగా విభజన చట్టంలో నిర్దేశించలేదు’. అన్నారు.

‘ప్రత్యేక హోదా కానీ, కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ కానీ, దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మాణం కానీ.. ఏ ఒక్కటీ చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. అన్నింటికీ ‘మే మే’ అన్నారే కానీ ‘షల్‌ షల్‌’ అని చెప్పలేదు. ఆ విధంగా కాంగ్రెస్‌ మోసం చేసింది. చట్టంలో ఒక వేళ అలా పెట్టి ఉంటే, ఇవాళ బీజేపీకి ఈ వెసులుబాటు ఉండేది కాదు’. అన్నారు.

‘ఇప్పుడు హోదా ఇచ్చే అవకాశం ఉన్నా బీజేపీ ఆ పని చేయడం లేదు. కాబట్టి ఆ పార్టీని కూడా నమ్మొద్దు. ఇక నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి కాపురం చేసి, హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో బీజేపీకి విడాకులు ఇచ్చి డ్రామాలు మొదలు పెట్టాడు. కాబట్టి చంద్రబాబును అస్సలు నమ్మొద్దు’ అని కోరారు.

హోదా ఎవరిస్తే వారికే మద్దతు
కాబట్టి రానున్న ఎన్నికల్లో మొత్తం 25 మంది ఎంపీలను తమ పార్టీ వారినే గెలిపించాలని జగన్ కోరారు. అప్పుడు ఎవ్వరు హోదా ఇస్తే వారికే మద్దతు ఇస్తామని, కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని చెప్పారు. అప్పుడు కూడా అవసరమనుకుంటే అందరు ఎంపీలతో రాజీనామా చేయించి ఉద్యమిస్తామని వెల్లడించారు.

బంద్‌కు మద్దతు ఇవ్వండి
‘చంద్రబాబుకు బుద్ధి రావాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం మంళవారం (24వ తేదీ) బంద్‌కు పిలుపునిస్తున్నాము. అందుకు కలిసి రావాలని అన్ని పార్టీలను కోరుతున్నాము. అదే విధంగా మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను’ అని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

విషయం తేటతెల్లమైంది
టీడీపీ, బీజేపీ కుమ్మక్కైన విషయం రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రసంగంలో తేటతెల్లమైందన్నారు. అంతే కాకుండా తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను సంతల్లో పశువుల్లా కొన్నారని, వారిని అనర్హులను చేయాలని ఇచ్చిన పిటిషన్‌ స్పీకర్‌ వద్ద పెండింగులో ఉందని, అయినా వారిలో ఒకరితో తమ పార్టీ సభ్యురాలిగా పేర్కొని మాట్లాడించారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఆక్షేపించారు. ఇది ఎంత అనైతికమని నిలదీశారు.

ఇక్కడ రాష్ట్రంలో కూడా తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని, దీంతో వారిని అనర్హులను చేయమన్నా ఇంకా చేయలేదని గుర్తు చేశారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోమన్నా స్పందన లేదని చెప్పారు.

ట్రాప్‌లా కనిపిస్తోందా?
హోదా కోసం తాము నిజాయితీగా చేస్తున్న పోరాటం ప్రధాని మోదీకి ఒక ట్రాప్‌లా కనిపిస్తోందా? అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు.