ఢిల్లీ : ఓటమి తప్పదన్న ఆందోళన కమలనాధుల్ని మరింత దిగజరుస్తున్నట్లుంది. మొన్నటిదాకా ఈవిఎంలను టాంపర్ చెస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ నేతలు ఇప్పుడు నకిలీ ఓటరు గుర్తింపు కార్డులతో ఎన్నికలను ప్రభావితం చేయాలని భావించినట్లు తేలిపోతుంది. కర్ణాటకలో భారీ సంఖ్యలో ఒక అపార్ట్మెంట్ లో దొరికిన నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీకి చెందిన ఒక నేత ఇంట్లో ఇవి దొరికినప్పటికీ బీజేపీ కీలక నేతలు మాత్రం అతనితో, ఆ ఇంటితో తమకు సంబంధం లేదని బుకాయించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు చివరకు ఆయనకే చుట్టుకున్నాయి. జవదేకర్ వ్యాఖ్యలు… ఓటరు కార్డులు దొరికిన ప్లాట్ యజమాని మాటలు కలిసి బీజేపీ దుర్నీతి బయట పడింది. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ మంగళవారం రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గంలో వేలాది ఓటరు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఐడీ కార్డులు ఉన్న ఫ్లాట్ యజమానురాలు మంజుల నంజమారి బీజేపీ తరపున కార్పొరేటర్‌గా గెలిచారని, ఆమె కుమారుడు శ్రీధర్ కూడా బీజేపీ కార్యకర్తేనని కాంగ్రెస్ చెబుతోంది. దానిని సదరు శ్రీధర్ కూడా అంగీకరించారు. తాము తొలి నుంచి బీజేపీకి చెందిన వాళ్ళమేనని స్పష్టం చేశారు. శ్రీధర్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ తాము నూటికి నూరు శాతం బీజేపీ కార్యకర్తలమేనని, ఈ విషయంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎందుకు అబద్ధం చెప్పారో తెలియడం లేదని అన్నారు. ఆయనకు తమ గురించి సరైన సమాచారం లేకపోయి ఉండవచ్చునని పేర్కొన్నారు. తమ ఫ్లాట్‌లో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయన్న విషయంలో తమకు ఎటువంటి సందేహం లేదని చెప్పారు. అయితే తాము తమ ఫ్లాట్‌ను రాకేశ్‌కు రెండు నెలల క్రితం అద్దెకు ఇచ్చామని తెలిపారు.
తన తల్లి మంజుల ఆరోగ్యం సహకరించకపోవడంతో కొద్ది రోజులుగా చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనడం లేదన్నారు. శ్రీధర్ చేసిన వ్యాఖ్యలతో ప్రకాష్ జవదేకర్ అబద్దాలు ఆడుతున్నారని అడ్డంగా దొరికి చూస్తుంటే బుకాయిస్తున్నారని తేలిపోయింది. కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ మంగళవారం మాట్లాడుతూ మంజులకు బీజేపీతో సంబంధాలు లేవన్నారు. బీజేపీపై పస లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంగళవారం రాత్రి చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ బెంగళూరులోని జలహళ్ళిలో ఉన్న ఓ ఫ్లాట్‌లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. 9,746 ఓటరు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇక విషయం బయటపడేసరికి బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా అదే బుకాయింపు సూత్రాన్ని నమ్ముకున్నారు. దీని వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం విమర్శలు గుప్పించారు. బోగస్ ఓటర్లు కార్డులు, డబ్బులు వెదజల్లడం ద్వారా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు గెలవాలనుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ విజయం తథ్యమని అన్నారు. తదుపరి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని జోస్యం చెప్పారు. అయితే మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనుండగా ఇప్పుడు బయట పడిన నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.