– రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషి
– విభజన హామీల అమలు నుంచి ప్రజలను తప్పదోవ పట్టించే యత్నం : దామచర్ల జనార్థన్‌రావు
ఒంగోలు : వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఒక కాలువ ద్వారానైనా నీటిని ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రామాయపట్నం పోర్ట్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలులో శనివారం జరిగిన ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన చట్టం హామీలను అమలు చేయకుండా, తమ మోసం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు.
రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఇప్పటికే అభాసుపాలైన బీజేపీ తాజాగా ప్రకాశం జిల్లా పేరుతో రాజకీయం చేస్తోందని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్యెల్యే దామచర్ల జనార్ధనరావు అన్నారు. మత విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్యని పేర్కొన్నారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా చేపట్టిన చర్చలో.. దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి రాష్ట్రానికి మద్దతు లభించిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా రాష్ట్రానికి నమ్మకద్రోహం, అన్యాయం చేసిందో 130 కోట్ల మంది ప్రజలకు తేటతెల్లం అయిందన్నారు. దేశం దృష్టిలో కేంద్రం దోషిగా నిలబడటాన్ని జీర్ణించుకోలేని బీజేపీ మరోసారి ప్రాంతీయ విద్వేష అస్త్రాన్ని బయటకు తీసిందని చెప్పారు. తెలుగువాడు అయిఉండి రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన జీవీఎల్ నరసింహారావు… ప్రజల పట్ల తన విద్వేషం, అసహనాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ప్రయోజనాలను కొనసాగిస్తూ.. ఏపీకి రిక్తహస్తం చూపారు. హోదావేరు, రాయితీలు వేరంటున్న జీవీఎల్.. ఏపీకి ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ మోసం ప్రతిఒక్కరికీ తెలిసిపోయింది. ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుండుసున్నా ఖాయం. జీవీఎల్ నరసింహారావు గారికి చిత్తశుద్ధి ఉంటే వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశంను చేర్చాలి.
రాష్ట్రంలోని 13 జిల్లాల సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషిచేస్తోంది. వెనుకబడిన జిల్లా ప్రకాశం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. రైతుల ఆదాయం వృద్ధితో పాటు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. సుమారు రూ.6 వేల కోట్ల పెట్టుబడులతో.. వివిధ పరిశ్రమల ద్వారా 50 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జరుగుమిల్లిలో సథరన్ ట్రిపికల్ ఫుడ్స్ కంపెనీ, మద్దిపాడులో ఈక్విటాస్ కంపెనీ, బీ.కే.ట్రెషర్స్ కంపెనీ, అద్దంకిలో కల్లం స్పిన్నింగ్ మిల్స్ కంపెనీ, ఒంగోలు, టంగటూరులో గ్రానైట్స్ కంపెనీ, శ్రీనివాస ఫార్స్ కంపెనీ ద్వారా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
విభజన చట్టంలో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రాష్ట్రం పట్ల కేంద్రం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఓట్లు, సీట్ల కోసం వైసీపీతో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తూ 5 కోట్ల ప్రజల ప్రయోజనాలను కాలరాశారు. తమ కుట్రలు బహిర్గతం కావడంతో అసహనంతో రాష్ట్ర్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కనీవినీ ఎరుగని రీతిలో బుద్ధిచెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గమనించాలి. ఇప్పటికే బీజేపీ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేదన్న వాస్తవాన్ని గమనించి హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.