Home ఆంధ్రప్రదేశ్ ఎపికి కేంద్రం అన్యాయంపై చంద్ర‌బాబు తీర్మానం… స‌మ‌ర్ధించిన బిజెపి…!

ఎపికి కేంద్రం అన్యాయంపై చంద్ర‌బాబు తీర్మానం… స‌మ‌ర్ధించిన బిజెపి…!

440
0

అమరావతి : శాస‌న స‌భ స‌మావేశాల సంద‌ర్భంగా బుధ‌వారం శాస‌న స‌భ‌లో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంపై కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తూ ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడు తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపిని ప్రస్తుత త‌రంతోపాటు భవిష్యత్తు తరాలు కూడా క్షమించరని అన్నారు. ‘‘విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని దిల్లీలో ప్రధాని, కేంద్రమంత్రులు, అధికారులను తాను స్వయంగా కలిసి సంప్రదింపులు జరిపి, వివిధ రూపాల్లో నిరసనల‌తో ఒత్తిడి పెంచినా కేంద్రం తన వైఖ‌రిని మార్చుకోకుండా మొండిగా వ్యవహరించడాన్ని శాసనసభ తీవ్రంగా గర్హిస్తున్నది. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పింద‌న్న కేంద్రం ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ఎలా హోదా ల‌బ్దిని కొనసాగిస్తుంద‌ని, ఎపికి ఇచ్చిన‌ ఆ హామీని ఎందుకు నెరవేర్చరని అసెంబ్లీ ద్వారా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాం. మోదీ ప్రభుత్వం ఎపి పట్ల అనుస‌రిస్తున్న వివక్షపూరిత ధోరణి భారత ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని సభ అభిప్రాయపడుతోంది. ఏపీకి పన్ను రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభ‌జ‌న నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీలతో పాటు చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను సంపూర్ణంగా అమలుచేయాలని సభ డిమాండ్‌ చేస్తోంది. ఈ హామీలు నెరవేర్చడం ద్వారా పార్లమెంట‌రీ వ్యవస్థ గొప్పతనాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం’’ అంటూ చంద్రబాబు తీర్మానం చదివి విన్పించారు. సీఎం చంద్ర‌బాబు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు సమర్థించారు.

ఇద్ద‌రు నేత‌ల సంవాదం…
కేంద్రంపై చంద్ర‌బాబు తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత బిజెపి శాస‌న‌ సభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు మాట్లాడారు. చంద్రబాబు ఏదైనా పర్‌ఫెక్ట్‌గా చెబుతారని అన్నారు. హృద‌యాన్ని హ‌త్తుకునేలా చెబుతార‌న్నారు. రాజు వ్యాఖ్య‌ల‌పై చంద్రబాబు జోక్యం చేసుకుని తాను చెప్పినదాంట్లో అసత్యం ఏమాత్రం లేదన్నారు. విభ‌జ‌న చట్టంలో ఉన్న వాటిలో 90శాతం చేసేశామని బిజెపి నేతలు చెప్ప‌డం దారుణమన్నారు. సున్నితమైన అంశాలపై అడ్డంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్నారు. ఏపీ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను నేటి తరాలే కాదు… భావితరాలు కూడా క్షమించర‌న్నారు. కేంద్రం వైఖరితో పుట్టబోయే త‌రం కూడా నష్టపోతుందని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం వైఖరికి నిరస‌న‌గా శాస‌న స‌భ‌లో తాము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఈ గ‌డ్డ‌పై పుట్టి ఉంటే బలపరచాలని బిజెపి ఎమ్మెల్యేలను కోరారు.

జీర్ణించుకోలేకపోతున్నాం..
విభజన హామీల సాధన కోసం తాను కేంద్రంపై పోరాటం చేస్తున్నాన‌ని చంద్రబాబు అన్నారు. ప్రజల హక్కుల కోసమే తప్ప తన స్వార్థం కోసం కాదన్నారు. తన పోరాటం భావితరాల భవిష్యత్తు కోసమన్నారు. ఆంద్ర‌ గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరూ పోరాటాన్ని స్వాగతించాలని కోరారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. నరనరాన ఆ బాధ ఉందన్నారు. ఈ తరుణంలో ఏపీ బిజెపి నేతలు కేంద్రం వైఖరిపై నిరస‌న వ్యక్తం చేయాల‌ని కోరారు. ఆంధ్రుడైన‌ ప్రతి వ్యక్తీ కేంద్రం వైఖరిపై బొబ్బిలిపులిలా తిరగబడాలని అన్నారు. “నేను ఆంధ్రునే, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకొనేది లేదు.“అంటూ బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు అన్నారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేస్తూ సభలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థించారు. చంద్రబాబు చెప్పిన విషయాలను అర్థం చేసుకున్నామన్నారు. తాము తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఎక్క‌డా చెప్ప‌లేద‌న్నారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానంపై మౌనం వహిస్తూ తాము కూడా ఆమోదం తెలుపుతున్నామని సభలో పేర్కొన్నారు.