Home జాతీయం ఆధార్‌తో సాధికారిత‌ : సుప్రీం

ఆధార్‌తో సాధికారిత‌ : సుప్రీం

425
0

డిల్లీ : జాతీయ గుర్తింపు కార్డు ఆధార్‌తో సమాజంలో బడుగు బలహీన వర్గాల ప్ర‌జ‌ల‌కు గుర్తింపు కార్డు లభించిందని సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎకె సిక్రి అన్నారు. ఈ కార్డుతో వారికి సాధికారిత వచ్చిందని అన్నారు. కార్డు రాజ్యాంగబద్ధమైనదేన‌ని చెప్పారు. ఆధార్ కార్డువ‌ల్ల‌ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లను విచారించిన‌ కోర్టు తీర్పు వెళ్ల‌డించింది. పిటీష‌న్ల‌పై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరపింది. మెజార్టీ తీర్పును జస్టిస్‌ ఏకే సిక్రి చదివి వినిపించారు. ఈ కార్డుతో నకిలీల సమస్య తొలిగింద‌న్నారు. ఆధార్ కోసం రెండోసారి వెళ్తే కంప్యూటర్‌ గుర్తిస్తుందన్నారు. అందుకే ప్రత్యేక గుర్తింపుగా చెప్పడానికి కారణమ‌న్నారు. ప్ర‌జ‌ల‌నుండి సాధ్య‌మైనంత క‌నీస స‌మాచారంతో ఇచ్చిన ఎకైక గుర్తింపు కార్డ‌ని పేర్కొన్నారు.

పిటిష‌న్ దారులు ఆధార్‌ వల్ల వ్యక్తిగత గోప్యత, హ్యాకింగ్‌ జరుగుతున్నాయని వాదిస్తున్నారు. ఆధార్‌ డేటా హ్యాకింగ్‌ చేశారనే వార్తలు వాస్త‌వం కాద‌ని ప్రభుత్వం పేర్కొన్న‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ప్రైవేట్‌ కంపెనీలు, మొబైల్‌ కంపెనీలు ఆధార్‌ డేటాను కోరడానికి వీల్లేదని కోర్టు చెప్పింది. బయోమెట్రిక్‌ సమాచారాన్ని కోర్టు అనుమ‌తి లేకుండా ఎలాంటి ఏజెన్సీలకు ఇవ్వకూడ‌ద‌ని పేర్కొంది. బిలియన్‌ మందికి పైగా భారతీయులు ఆధార్‌ నమోదు చేసుకున్న‌ట్లు కోర్టు తెలిపింది.

బ్యాంకు ఖాతాలు తీసుకోవ‌డానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు ప్ర‌క‌టించింది. అలాగే మొబైల్‌ కనెక్షన్ తీసుకునేందుకు కూడా అవసరం లేదని చెప్పింది. పాఠశాల అడ్మిషన్లకు, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ వంటి పరీక్షలకు హాజరయ్యేందుకు కూడా ఆధార్‌ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టంచేసింది. అయితే ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్‌ చేయడానికి, పాన్‌ కార్డు నమోదు చేసుకోవడానికి ఆధార్‌ కార్డు తప్పని స‌రిగా ఉండాల‌ని కోర్టు చెప్పింది.